- టెండర్లు పిలిచింది 2025లోనే..
- ఈ ఆగస్టులో కొత్త జీవో ఇచ్చారు
- 2022 జీవో 56లో సాగర్ ఊసే లేదు.. కొత్త జీవోలోనే పేర్కొన్నరు
- ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెబితే నిజాలు అయిపోవు
- ‘పల్నాడు’పై కృష్ణా బోర్డులో ప్రభుత్వం తరఫున ఎందుకు ప్రశ్నించలే!
- మేము ఎన్జీటీలో పోరాటం చేయడంతోనే రాయలసీమ లిఫ్ట్ ఆగింది
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఆపాలని పదవులను గడ్డిపోచల్లా వదిలేశాం
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ అడ్డంగా దొరికిపోయారని, సాగర్‌కు పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోతుంటే అడ్డుకోకుండా కృష్ణా బోర్డు మీటింగ్‌లో మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు 2025 జనవరిలోనే టెండర్లు పిలిచారని, ఈ ఏడాది ఆగస్టులో జీవో ఇచ్చారన్నారు. అయినా ఏపీని ఎందుకు ఆపలేదని నిలదీశారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పత్రికల్లో వార్తలు వచ్చి, కేటీఆర్ ప్రశ్నించిన తర్వాత బ్యాక్‌డేట్ వేసి కేంద్రానికి ఉత్తరం రాశారని విమర్శించారు. 2022లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 56లో నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని గానీ, ఇన్ని టీఎంసీలు వాడుతామని గానీ ఎక్కడా లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకే ఈ ఏడాది ఆగస్టులో సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని స్పష్టమైన వివరాలతో ఏపీ జీవో ఇచ్చిందని తెలిపారు. ‘‘నిన్న అంత సేపు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పల్నాడు ప్రాజెక్టును ఆపుతా అని ఒక్క మాటైనా చెప్పారా? కృష్ణా బోర్డు మీటింగ్‌లో మన ఇంజినీర్లు నోరు మూసుకున్నారు. గురుదక్షిణ కోసం మాట్లాడొద్దని సీఎం చెప్పి ఉంటారు’’ అని ఆరోపించారు. సాగర్ కుడి కాల్వ కింద ఉన్న ఒంగోలు బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం 483 జీవో ఇస్తే, సీఎం జీవో నంబర్ (482 అని) కూడా తప్పుగా చెప్పి ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.
512:299 ఒప్పందంపై సంతకం పెట్టింది
ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషి
కృష్ణా జలాల్లో 512:299 టీఎంసీల పంపిణీకి నాటి కాంగ్రెస్సే కారణమని, తన పక్కన ఉన్న ఉత్తమ్, దామోదర, శ్రీధర్ బాబులే అందుకు బాధ్యులని విమర్శించారు. 2013 అక్టోబర్ 18న ఉమ్మడి అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఆధారంగానే 2015లో కేవలం తాత్కాలిక సర్దుబాటు మాత్రమే జరిగిందని, అది ట్రిబ్యునల్ వాదనలకు చెల్లదని చెప్పారు. ‘‘ఒప్పందంపై కేసీఆర్ సంతకం పెట్టారనడం పచ్చి అబద్ధం. ఏపీ తరఫున మీ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ తరఫున ఎస్కే జోషి సంతకాలు పెట్టారు’’ అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్ వేయాలని, అదనంగా 581 టీఎంసీలు కావాలని నాటి కేంద్ర మంత్రి ఉమాభారతికి కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. 34:66 కాకుండా 50:50 వాటా కోసం 2021 నుంచి 30 లేఖలు రాశామని, కానీ 2025 మార్చి 17న జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్‌లో 34:66 నిష్పత్తిలోనే నీటి పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సంతకం చేసిందని ప్రశ్నించారు. ‘‘మైక్ కట్ చేయకుండా పది రోజులు అసెంబ్లీ పెట్టు.. అన్నం తినకుండనైనా చర్చిద్దాం. నీ సంగతి తేలుస్తా’’ అని సవాల్ విసిరారు.
కేసీఆర్‌ను ఉరి తీయాలంటరా?
‘సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు కేసీఆర్‌ను ఉరి తీయాలంటున్నారా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో సమైక్యవాదుల పంచన చేరి, జిరాక్స్ కాపీలతో రాజీనామా డ్రామాలు ఆడి, పట్టపగలు నోట్ల కట్టలతో దొరికారంటూ రేవంత్ రెడ్డిని విమర్శించారు. చంద్రబాబు కోవర్ట్ ఆదిత్యనాథ్ దాస్‌ను పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ కుడి కాల్వ లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించి, ఎడమ కాల్వను రైతులపై మోపారని, జూరాల విషయంలో కర్ణాటకకు డబ్బులు కట్టకపోవడం, మెదక్‌లో సింగూరు నీళ్లు ఇవ్వకపోవడం, 60 ఏండ్లలో ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం వరకు ఒక్క ఆనకట్ట కట్టకపోవడం కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే జరిగాయని చెప్పారు. కేసీఆర్ వచ్చాకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కట్టి, 42.77 లక్షల ఎకరాలకు నీళ్లు, 218 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించారని, మిషన్ కాకతీయ, రైతుబంధుతో 2020–21లోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయిందన్నారు. మిషన్ భగీరథ హర్ ఘర్ జల్‌కు, నేటి పల్నాడు ప్రాజెక్టుకూ ఇన్స్పిరేషన్ అని కేంద్రమే పార్లమెంటులో చెప్పిందన్నారు. మరి, సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా.. తన సొంత జిల్లాలో లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు.
కుప్పంకు నీళ్లు.. పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం
పాలమూరులో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని, కానీ రేవంత్ సీఎం అయ్యాక 2024 డిసెంబర్లో జీవోలు 403, 405 ఇచ్చి చంద్రబాబు కోసం 750 కిలోమీటర్ల దూరంలోని కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు పారించుకునేలా లైనింగ్‌కు అనుమతిచ్చారని హరీశ్ రావు ఆరోపించారు. పాలమూరు ప్యాకేజీ-3లో 3 కిలోమీటర్ల కెనాల్ పనులు చేయలేక, 20 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్న హామీని నెరవేర్చలేక పోయారన్నారు. పాలమూరు, వార్ధా, థర్డ్ టీఎంసీ, సమ్మక్క సాగర్ డీపీఆర్‌లు వెనక్కి తెచ్చుకున్నారని, అనుమతులు రద్దయ్యేలా జీఆర్ఎంబీ ఎజెండాలో ఉంటే ఏం చేశారని నిలదీశారు. కల్వకుర్తి, దేవాదుల, సీతారామ లిఫ్టులు ఎన్ని రోజులు నడిపారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా బేసిన్లో 2024లో 28 శాతం, 2025లో 25 శాతం మాత్రమే నీళ్లు వాడి చరిత్రలో అత్యల్ప నీటి వినియోగం చేసిన ప్రభుత్వంగా నిలిచిందని విమర్శించారు. ఎన్ని టీఎంసీలు వాడారో చెప్తున్నారే తప్ప.. ఎంత శాతం వాడారన్నది ఎందుకు చెప్పడం లేదన్నారు.
ఎన్జీటీ ఆదేశాలతోనే రాయలసీమ లిఫ్ట్ ఆగింది
చంద్రబాబుకు ఫోన్ చేసి రాయలసీమ లిఫ్ట్ ఆపించానన్న రేవంత్ రెడ్డి మాటలను ఆ మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం ఖండించిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసులో ఎన్జీటీ ఆదేశాల మేరకే పనులు ఆగాయని ఏపీ ప్రకటించిందన్నారు. 2020 మేలో జగన్ ప్రభుత్వం జీవో ఇస్తే, అంతకు నాలుగు నెలల ముందే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ప్రాజెక్టును ఆపించాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాశామని గుర్తు చేశారు. మొత్తం 19 లేఖలు రాశామన్నారు. అపెక్స్ కౌన్సిల్లోనూ అప్పటి ఏపీ సీఎం జగన్‌కు గట్టిగానే బదులిచ్చామన్నారు. రాయలసీమ ఆపకుంటే ఆలంపూర్ వద్ద బ్యారేజీ కట్టి నీళ్లు రాకుండా చేస్తామని కేసీఆర్ హెచ్చరించారన్నారు. బ్యారేజీపై కేబినెట్ లో చర్చించి జీవో కూడా ఇచ్చామన్నారు. వాళ్లు ప్రాజెక్టును ఆపకుంటే శ్రీశైలం మొత్తాన్ని తమ కంట్రోల్‌కు ఇవ్వాలని అప్పటి జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌కు లేఖ రాశామని గుర్తు చేశారు.
పదవులు వదిలి పోరాడినం..
పోతిరెడ్డిపాడు విషయంలో బీఆర్ఎస్ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘సోనియా గాంధీ అడిగితే, కేసీఆర్ ఆదేశాలతో మేం ఆరుగురం ఇండిపెండెంట్ మంత్రులమయ్యాం. పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు నష్టం చేస్తుంటే పదవులను గడ్డిపోచల్లా వదిలి రాజీనామా చేశాం. దిగ్విజయ్ సింగ్ బతిలాడినా వినలేదు. మేము వదిలేసిన పదవులను ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈ నాటి మంత్రులే తీసుకుని, పోతిరెడ్డిపాడుపై అపోహలు వద్దన్నారు’’ అని ఆరోపించారు. 2005 అక్టోబర్‌లో జీవో 170 రద్దు కోసం 46 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి, 7 రోజుల పాటు చర్చ జరిపిస్తే నాటి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారని గుర్తు చేశారు.
హంద్రీనీవాకు డీకే అరుణ హారతులు పడితే, చిన్నారెడ్డి వ్యాసాలు రాశారని విమర్శించారు. మూడేండ్లయినా సీఎంకు బడ్జెట్ పద్దుల ఆమోదంపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యే కాకుండానే వైఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యానన్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘గతంలో ఎమ్మెల్యే కాకుండానే నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం అయ్యారు. చంద్రబాబు హయాంలో హరికృష్ణ ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యారు. ఇప్పుడు మీరు అజరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ చేశారు. టాలెంట్ ఉన్నందుకే కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు. ఏడుసార్లు నా ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ సమయం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అన్ని అంశాలను ఎండగడతారని తెలిపారు.
