తండ్రి పేర భూమిని తనయుడే కాజేసిండు..బతికున్న తండ్రి చనిపోయినట్లు నకిలీ పత్రాలు

తండ్రి పేర భూమిని తనయుడే కాజేసిండు..బతికున్న తండ్రి చనిపోయినట్లు నకిలీ పత్రాలు
  •   రెండెకరాల భూమిని తన పేర మార్చుకున్న కొడుకు 
  •     సూర్యాపేట జిల్లా సూర్యతండాలో ఆలస్యంగా వెలుగులోకి.. 
     

తుంగతుర్తి, వెలుగు:  తండ్రి బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, ఆయన పేరు మీద ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిని తన పేరుపైకి మార్చుకున్న ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సూర్యతండా గ్రామపంచాయతీలో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ గిరిజన రైతు గతంలో తనకున్న భూమిలో తన కోసం రెండెకరాలు ఉంచుకొని, మిగతా భూమిని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. 

అయితే, ఆ రెండెకరాలను కూడా తన పేరు మీదనే రాయాలని కుమారుడు తండ్రిపై తరచూ ఒత్తిడి తెస్తుండేవాడు. ఆ భూమిని ఎక్కడ తన చెల్లెళ్ల పేరిట రాస్తాడోనన్న అనుమానంతో తండ్రితో 
గొడవపడేవాడు. ఈ క్రమంలో 2021లో తన తండ్రి మరణించినట్లు ఫోర్జరీ డెత్ సర్టిఫికెట్ సంపాదించాడు. 


నెల రోజుల కింద తండ్రికి తెలియకుండానే ఆ నకిలీ డెత్ సర్టిఫికెట్‌‌ను చూపించి, ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండానే అధికారులతో కుమ్మక్కై తండ్రి పేరిట ఉన్న రెండెకరాల భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఇటీవల ఆన్‌‌లైన్‌‌లో తన పేరు మీద భూమి కనిపించకపోవడంతో తండ్రి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులను ఆరా తీయగా ఈ మోసం బయటపడింది. 

ఈ విషయమై తహసీల్దార్ దయానంద్‌‌ను వివరణ కోరగా కుమారుడు డెత్ సర్టిఫికెట్ చూపించి తనను తప్పుదోవ పట్టించాడని, అందువల్లే భూమిని అతడి పేరున మార్చాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తిరిగి ఆ రెండెకరాల భూమిని తండ్రి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.