హైదరాబాద్, వెలుగు: విద్యార్థులపై కుల, వర్గ, జాతి, ఇస్లామోఫోబిక్ వివక్ష వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హిస్టరీ విభాగం ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ విజయ రాందాస్‌ను తక్షణమే విధుల నుంచి టెర్మినేట్ చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రాందాస్‌ను తొలగించి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ వర్సిటీలో యూనియన్ చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది.
ఈ పోరాటానికి హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలవాలని కోరుతూ యూనియన్ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు యూజీసీ ఈక్విటీ గైడ్‌లైన్స్–2012ను పారదర్శకంగా అమలు చేయాలని, దేశవ్యాప్తంగా ‘రోహిత్ యాక్ట్’ను తీసుకురావాలని, ఇందుకు మద్దతుగా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు తీర్మానాలు చేయాలని లేఖలో కోరింది.
ఈ ఏడాది ఏప్రిల్ 16న డాక్టర్ రాందాస్ పంపిన ఈ–మెయిల్‌లో ఓ విద్యార్థిని ఉద్దేశించి ‘దళిత అంటరాని మూర్ఖుడు’ అని సంబోధించారని, బిహార్, జార్ఖండ్ విద్యార్థులను నాగరికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం వారిగా పేర్కొంటూ ఆఫ్రికా దేశాలతో పోల్చారని యూనియన్ ఆరోపించింది. ఉన్నత వర్గం, సంస్కృతిలో పుడితేనే క్లాస్ వస్తుంది తప్ప అనుకరిస్తే రాదు అని రాశారని పేర్కొంటూ, ఇది విద్యాసంస్థల్లో వివక్షాపూరిత ధోరణికి నిదర్శనమని విమర్శించింది.
