వరంగల్‍ పశ్చిమలో ‘హై టెన్షన్‍’..రెండ్రోజులుగా కాంగ్రెస్‍, బీఆర్‍ఎస్‍ నేతల సవాళ్లు

వరంగల్‍ పశ్చిమలో ‘హై టెన్షన్‍’..రెండ్రోజులుగా కాంగ్రెస్‍, బీఆర్‍ఎస్‍ నేతల సవాళ్లు
  • రోడ్డెక్కిన సిటీ బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ శ్రేణులు 
  • ధర్నాలు, దాడులు, లాఠీఛార్జీలతో తీవ్ర ఉద్రిక్తత

వరంగల్‍, వెలుగు: హనుమకొండ సిటీలో మంగళవారం సాయంత్రం పొలిటికల్‍ టెన్షన్‍ నెలకొంది. బీఆర్‍ఎస్, కాంగ్రెస్‍ శ్రేణులు సై అంటే సై అంటూ రోడ్డెక్కడంతో ఉద్రిక్తత  చోటుచేసుకుంది.  ఈ నెల 22న బీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ జనచైతన్య సభలో మాట్లాడుతూ వరంగల్​లో  తామే అనేక   ప్రాజెక్టులు చేపట్టినట్టు చెప్పుకున్నారు. 

ఆయన మాటలను కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍.నాగరాజు, ఎంపీ కడియం కావ్య,  కుడా చైర్‍పర్సన్‍ గుండు సుధారాణి ఖండించారు. సోమవారం వారు మీడియా ముందు ‘కేసీఆర్‍ వంద అబద్దాలు’ పేరిట హామీలిచ్చి వదిలేసిన అంశాలకు సంబంధించి వీడియోలు ప్రదర్శించారు. 

 కేటీఆర్‍ చెప్పిన మాట నిజమైతే  హనుమకొండ చౌరస్తాలో చర్చకు రావాలని కాంగ్రెస్​ నేతలు సవాల్ చేశారు.  వారి సవాల్​ కు బీఆర్‍ఎస్‍ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‍ భాస్కర్‍, నన్నపునేని నరేందర్‍ స్పందిస్తూ  ఎమ్మెల్యే పదవికి నాయిని  రాజీనామా చేసి మళ్లీ బరిలోకి దిగాలని,  తాను అతడిని  ఓడిస్తానని వినయ్​ భాస్కర్​సవాల్​ చేశారు. 

మంగళవారం సాయంత్రం  5 గంటలకు చర్చలకు గడువు విధించారు. మంగళవారం సాయంత్రం  బీఆర్‍ఎస్‍ కార్యకర్తలు  తమ ఆఫీసు పక్కనే ఉన్న  ఎమ్మెల్యే నాయిని క్యాంప్‍ ఆఫీస్‍ ముందు  ధర్నాకు దిగారు.  అదేసమయంలో  చర్చ కోసం హనుమకొండ చౌరస్తాకు బయలుదేరిన కాంగ్రెస్‍ కేడర్​ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే నాయిని ఇంటివద్దకు చేరింది. 

దీంతో  బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ లీడర్లు, కార్యకర్తల మధ్య వాగ్వదం జరిగింది.  అక్కడున్న లీడర్ల ఫ్లెక్సీలు చింపేసి,  రాళ్లు రువ్వుకున్నారు. వీరిని చెదరగొట్టేందుకు  పోలీసులు స్వల్ప  లాఠీచార్జీ చేశారు.  రెండు పార్టీల లీడర్లను పోలీస్‍ స్టేషన్‍ తరలించారు.