వెలుగు స్పెషల్ : ఆకాశహర్మ్యాలు...అగ్నిమాపక సన్నద్ధత ఎంత?

వెలుగు స్పెషల్ : ఆకాశహర్మ్యాలు...అగ్నిమాపక సన్నద్ధత ఎంత?

2026 నవంబర్‌‌ 19న హైదరాబాద్‌‌ పుప్పలగూడలోని పసిఫికా హిల్‌‌క్రెస్ట్‌‌ అపార్ట్‌‌మెంట్‌‌లో జరిగిన అగ్నిప్రమాదం ఎత్తైన భవనాల అగ్నిమాపక సన్నద్ధతపై మరోసారి చర్చకు తెరతీసింది. వివిధ నివేదికల ప్రకారం ఆరో అంతస్తులో మొదలైన మంటలు భవనం వెలుపలి భాగం వెంట 17వ అంతస్తు వరకు వ్యాపించాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో బ్రాంటో స్కైలిఫ్ట్‌‌ సహా నాలుగు ఫైర్‌‌ టెండర్లు, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని, 20 నిమి షాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలోని స్ప్రింక్లర్లు, హైడ్రెంట్లు, అత్యవసర మెట్లు కూడా మంటలను నియంత్రించడంలో సహాయపడ్డాయి. ఈ ఘటనలో అగ్నిమాపక శాఖ సత్వర స్పందన, భవనంలోని అంతర్గత భద్రతా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం, ప్రాణనష్టం లేకపోవడం సానుకూల అంశాలు. అదే సమయంలో, మంటలు అనేక అంతస్తుల మీదుగా వ్యాపించడం ఎత్తైన భవనాల్లో అగ్నిమాపక భద్రతపై కొన్ని ప్రశ్నలను సంధిస్తోంది. 

హైదరాబాద్‌‌లో  సుమారు 1,800 ఎత్తైన భవనాలున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2024లో దాదాపు 100 భవనాలకు అనుమతులు లభించగా, 2025లో  ఈ  సంఖ్య దాదాపు రెట్టింపై 192కు చేరింది. కొకాపేటలో 66 అంతస్తులు, ఉస్మాన్‌‌ నగర్‌‌లో 70 అంతస్తుల భవనాలకు అనుమతులు లభించాయి. ఎత్తైన భవనాలకు అనుమతులిచ్చే ప్రక్రియలో అగ్నిమాపక భద్రతకు ఇప్పటికే విస్తృతమైన నిబంధనలు ఉన్నాయి. వాటి అమలు, నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వాటి పనితీరే ఇప్పుడు ప్రధాన పరిశీలనాంశాలు.

అనుమతుల దశలోనే భద్రతా ప్రమాణాలు

తెలంగాణలో 2026 అక్టోబర్‌‌ 7నుంచి అమల్లోకి వచ్చిన సూచనల ప్రకారం, 24 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున్న నివాస భవనాలకు ఫైర్‌‌ ఎన్‌‌ఓసీ పొందడం తప్పనిసరి. అటువంటి భవనాల్లో ఫైర్‌‌ టవర్‌‌, ఫైర్‌‌ కమాండ్‌‌ సెంటర్‌‌ లు విధిగా ఏర్పాటు చేయాలి. ఫైర్‌‌ ఎక్స్‌‌టింగ్విషర్లు, హోస్‌‌ రీల్స్‌‌, వెట్‌‌ రైజర్లు, యార్డ్‌‌ హైడ్రెంట్లు, ఆటోమేటిక్‌‌ స్ప్రింక్లర్లు, ఫైర్‌‌ అలారాలు వంటి పరికరాలు, వ్యవస్థలు నిర్దేశిత ప్రమా ణాలకు అనుగుణంగా ఉండాలి. భవనాల ఎత్తును బట్టి కనీస భూగర్భ అగ్నిమాపక నీటి నిల్వ, టెర్రస్ ట్యాంకులో నీటి నిల్వలను నిర్దేశించారు. తెలంగాణలో ఫైర్‌‌ ఎన్‌‌ఓసీ ప్రక్రియ రెండు దశల్లో సాగుతుంది. నిర్మాణానికి ముందు ప్రొవిజనల్‌‌ ఎన్‌‌ఓసీ ద్వారా ప్లాన్‌‌లో ఎలాంటి అగ్నిమాపక ఏర్పాట్లు ఉండాలో నిర్దేశిస్తారు. నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌ జారీకి ముందు భవనాన్ని మరోసారి తనిఖీ చేస్తారు. 

తనిఖీలు ఎలా జరుగుతున్నాయి?

2026 జనవరి 20న జారీ చేసిన జీఓ నం.15 ద్వారా ప్రభుత్వం థర్డ్‌‌ పార్టీ ఫైర్‌‌ అండ్‌‌ లైఫ్‌‌ సేఫ్టీ ఆడిటర్ల నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. భవన యజమాని లేదా కిరాయిదారు ప్రతి  జనవరి, జులై నెలల్లో అగ్నిమాపక, ప్రాణరక్షణ ప్రమాణాల అమలుపై ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. థర్డ్‌‌ పార్టీ తనిఖీ, స్వీయ ధ్రువీకరణ, ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన నివేదికల సమర్పణ వంటి విధానాలూ అమల్లో ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థ అమలుపై సమగ్ర గణాంకాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. 

ఆడిట్‌‌ చేయించాల్సిన భవనాలు ఎన్ని? గడువులోగా ధ్రువీకరణ పత్రాలు సమర్పించనివి ఎన్ని?  తనిఖీల్లో  ఏయే  లోపాలు గుర్తించారు? వాటిలో ఎన్ని సరిదిద్దారు? లోపాలు సరిదిద్దని భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?  ఈ  వివరాలు బహిరంగంగా వెల్లడైతేనే ఆడిట్‌‌ వ్యవస్థ ప్రభావాన్ని అంచనా వేయగలం. అదే సమయంలో అపార్ట్‌‌మెంట్‌‌ యజమానులు, నిర్వహణ సంఘాల్లోనూ భద్రతపై అవగాహన పెరుగుతుంది.

స్కైలిఫ్టుల కథాకమామిషు

ఈ సందర్భంలో అగ్నిమాపక శాఖ రక్షణ సామర్థ్యాన్ని కూడా చర్చించాలి. పుప్పలగూడ ఘటనలో ఉపయోగించిన బ్రాంటో స్కైలిఫ్ట్‌‌ సుమారు 18 అంతస్తుల వరకు చేరగలదు. హైదరాబాద్‌‌లో ఇటువంటి రెండు స్కైలిఫ్ట్‌‌లు మాదాపూర్‌‌, సచివాలయం వద్ద ఒక్కొక్కటి చొప్పున అందుబాటులో ఉన్నట్లు 2026 నవంబర్‌‌ 20న అగ్నిమాపక శాఖ అధికారి వెల్లడించారు. తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారిక స్టేషన్‌‌ డైరెక్టరీలో..  గచ్చిబౌలిలో 101 మీటర్ల ఎత్తు వరకు చేరగల హైడ్రాలిక్‌‌ ప్లాట్‌‌ఫారమ్‌‌ ఉన్నదని, అది ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఇంతటి సామర్థ్యం గల పరికరం ఇంకా కార్యాచరణలోకి రాకపోవడానికి కారణాలేమిటి?  స్పష్టత రావాలి. 

హాంకాంగ్‌లోని ‌వాంగ్‌ ఫుక్​ కోర్ట్ అగ్ని ప్రమాదంలో..

హైదరాబాద్‌‌ ఎత్తైన భవనాల కోసం ఇప్పటికే విస్తృతమైన నిబంధనలు ఉన్నాయి. వాటికి తోడు డ్రోన్‌‌ సాంకేతికతను థర్మల్‌‌ కెమెరాల సహాయంతో అగ్నిప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి, పై అంతస్తుల్లో చిక్కుకున్నవారిని గుర్తించడానికి వినియోగించే అవకాశాన్ని పరిశీలించవచ్చు. హాంకాంగ్‌‌లో 2025 వాంగ్‌‌ ఫుక్‌‌ కోర్ట్‌‌ అగ్నిప్రమాద సమయంలో అగ్నిమాపక శాఖ డ్రోన్లను..  థర్మల్‌‌ ఇమేజింగ్‌‌ ద్వారా మంటల పరిస్థితిని అంచనా వేయడానికి, చిక్కుకున్నవారిని గుర్తించడానికి, రాత్రివేళ ఎత్తైన ప్రాంతాల్లో వెలుతురు అందించడానికి ఉపయోగించింది. అయితే డ్రోన్ల ద్వారా నేరుగా మంటలను ఆర్పే సాంకేతికత ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. అందువల్ల వాటిని ప్రస్తుత హైడ్రెంట్లు, స్ప్రింక్లర్లు, ఫైర్​లిఫ్టులు, హైడ్రాలిక్‌‌ ప్లాట్‌‌ఫారమ్‌‌లకు ప్రత్యామ్నాయంగా కాకుండా సహాయక సాధనాలుగా మాత్రమే పరిగణించాలి. 

మాక్​డ్రిల్స్​ తప్పనిసరి

అగ్నిమాపక భద్రత సంబంధిత శాఖ, భవన యజమానుల బాధ్యతతోనే ముగిసిపోదు. గృహయజమానులు ఫైర్‌‌ ఎగ్జిట్‌‌లు, మెట్లు, కారిడార్లను వస్తువులతో ఆక్రమించకుండా చూడాలి. అత్యవసర మార్గాలు, అల్లారాలు వంటి అగ్నిమాపక పరికరాల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి. అపార్ట్‌‌మెంట్‌‌ నిర్వహణ సంఘాలు పరికరాల నిర్వహణ, మాక్‌‌ డ్రిల్స్‌‌, అత్యవసర తరలింపు ప్రణాళికలను క్రమం తప్పకుండా సమన్వయం చేయాలి. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లుచేయాలి. సమాజం కూడా ఫైర్‌‌ టెండర్ల  రాకపోకలకు రహదారులు, భవన ప్రవేశ మార్గాలు ఖాళీగా ఉంచడంలో సహకరించాలి. భవనానికి అనుమతి ఇవ్వడం భద్రతకు ముగింపు కాదు. పరికరాలు అమర్చడం కూడా సరిపోదు. అవి ఎప్పుడూ పనిచేసే స్థితిలో ఉండాలి. అత్యవసర సమయంలో వాటిని సమర్థంగా వినియోగించగలగాలి.  

- కృష్ణ బాలాజి పల్లపోతు
బ్యాంకు అధికారి (రి)