- నుమాయిష్ పనుల్లో ప్రమాదం
- గంటపాటు నరకయాతన..
- చేయి తొలగించే అవకాశం
బేగంబజార్, వెలుగు : పొట్టకూటి కోసం సొంతూరును వదిలి నగరానికి వచ్చిన ఓ 17 ఏండ్ల బాలుడు చేయి పోగొట్టుకునే స్థితికి చేరుకున్నాడు. నుమయిష్ ఏర్పాట్లలో భాగంగా రోడ్డు రిపేర్లు చేస్తుండగా కాంక్రీట్ మిక్సర్ మెషీన్లో చేయి ఇరుక్కుపోయి నరకయాతన పడ్డాడు. ఒకవైపు తీవ్రంగా రక్తం పోతుండటం, మరోవైపు చేతిని బయటకు తీయలేక వేదన అనుభవించాడు. చివరికి అగ్నిమాపక సిబ్బంది అతడిని కాపాడి దవాఖానకు తరలించినా చేయి తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు ప్రకటించారు. జనవరి1న ప్రారంభం కానున్న నుమయిష్ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సొసైటీ రోడ్ల రిపేర్ల పనులు చేపట్టింది.
ఇందులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుడ్మా గ్రామానికి చెందిన రింకు తన సోదరుడితో కలిసి వచ్చి పనిచేస్తున్నాడు. మంగళవారం ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిక్సర్ మెషీన్లో రింకు చేయి ఇరుక్కుపోయింది. దీంతో చేయి బయటకు తీయలేక విలవిల్లాడిపోగా, తోటి కార్మికులు ఇనుపరాడ్ల సాయంతో తీసేందుకు ప్రయత్నించారు. అయినా, ఫలితం లేకపోవడంతో గౌలిగూడ ఫైర్ఫైటర్స్వచ్చి శ్రమించి బయటకు తీశారు.
తర్వాత ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాగా, 17 ఏండ్ల పిల్లవాడిని కాంట్రాక్టర్ పనిలో పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాల కార్మికులతో పనులు చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు.
