గొల్లపల్లి, వెలుగు: అర్హులందరికీ చేయూత పింఛన్లు అందజేస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో మంగళవారం ఆయన కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేశామని మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.
గొల్లపల్లి మండలానికి కొత్తగా 735 చేయూత పింఛన్లు మంజూరు అయినట్లు తెలిపారు. మండలంలో అర్హత ఉన్న వారిని గుర్తించి పింఛన్లు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆఫీసర్లకు సూచించారు. సంక్రాంతి తర్వాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి మౌలిక సదుపాయాలకు కావాల్సిన నిధులు సమీకరించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సంతోష్, తహసీల్దార్ మజీద్, ఎంపీడీవో రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
