బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఖర్జీ సమీప అటవీ ప్రాంతంలో కరెంటు తీగలు అమర్చి చుక్కల దుప్పిని హతమార్చిన కేసులో మంగళవారం నలుగురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు నీలవాయి రేంజ్ ఆఫీసర్ మహ్మద్ అఫీజోద్దీన్, బద్దంపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మిర్జా జియా ఉల్లాబేగ్ తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. దుప్పిని వేటాడినట్లు అందిన పక్కా సమాచారంతో ఖర్జీ జంగాల్పేటకు చెందిన వేటగాళ్లు కుమ్మరి మొండి, ఏల్పుల భీమేశ్, టేకం తిరుపతి, టేకం మల్లేశ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా, దుప్పి మాంసం లభ్యమైంది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, మన్నెగూడానికి చెందిన పోగుల లింగయ్య, రాంటెంకి అంకులు మాంసం తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఖర్జీ గ్రామానికి చెందిన నలుగురిని రిమాండ్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించగా, మన్నెగూడానికి చెందిన ఇద్దరు వేటగాళ్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఈ దాడిలో బీట్ ఆఫీసర్ శివకుమార్, నీల్వాయి బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
