- రైల్వే బోర్డు మెంబర్ వివేక్ కుమార్
- ఘనంగా ఇరిసెట్ 69వ వార్షికోత్సవం
పద్మారావునగర్, వెలుగు : ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్) 69వ వార్షికత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రైల్వే బోర్డు సభ్యులు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) వివేక్ కుమార్ గుప్తా మాట్లాడుతూ స్వదేశీ టెక్నాలజీ 'కవచ్' అమలుతో రైలు ప్రయాణాలు మరింత సురక్షితంగా మారాయని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సిబ్బంది ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, రైల్వే బోర్డు అదనపు సభ్యులు శైలేష్ గుప్తా మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకునేలా ఇంజినీర్లను తీర్చిదిద్దడంలో ఇరిసెట్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఇరిసెట్ డీజీ పీయూష్ కుమార్ గుప్తా వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం టాపర్లకు బహుమతులు ప్రదానం చేసి, 'జ్ఞానదీప్' పత్రికను ఆవిష్కరించారు.
