వీడీసీ పేరుతో సర్పంచ్ విధులకు ఆటంకం..కుంటాల పీఎస్లో ఫిర్యాదు

వీడీసీ పేరుతో సర్పంచ్ విధులకు ఆటంకం..కుంటాల పీఎస్లో ఫిర్యాదు

కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల (వీడీసీ) పేరుతో కొందరు పెత్తనం చెలాయిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కల్లూరు గ్రామంలో వీడీసీ అధ్యక్షుడు భరత్ భూషణ్, సర్పంచ్ పెంట దశరథ్ మధ్య వివాదం చోటుచేసుకుంది.

 రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోరు నుంచి నీటిని తీసుకెళ్లవద్దంటూ భరత్ భూషణ్ తనతో వాగ్వాదానికి దిగారని సర్పంచ్ ఆరోపించారు. తనను అవమానకరంగా దూషించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని మంగళవారం కుంటాల పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. 

ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి సర్పంచ్‌‌‌‌గా ఎన్నికైనప్పటి నుంచి వీడీసీ అధ్యక్షుడు భరత్ భూషణ్‌‌‌‌తో పాటు మరికొందరు గ్రామాభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని దశరథ్ ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

ఈ విషయంపై ఎస్సై నరేష్‌‌‌‌ను వివరణ కోరగా, సర్పంచ్ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఫిర్యాదు ప్రతిని జిల్లా ఎస్పీకి కూడా అందజేయనున్నట్లు సర్పంచ్ దశరథ్ పేర్కొన్నారు.