- తిరుప్పరంకుండ్రం దీపతూన్లో వెలగని దీపం
- కొండ దిగువన హిందూ సంఘాల ఆందోళన
న్యూఢిల్లీ: తమిళనాడులోని ప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కొండపై మంగళవారం సాయంత్రం కార్తీక దీపం వెలిగించే విషయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాతి స్తంభం ‘దీపతూన్’ పై ఈ ఏడాది దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆలయ పూజారులు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కాకుండా సంప్రదాయంగా వెలిగించే ఉచ్చిపిళ్లయార్ ఆలయ ప్రాంగణంలోనే సాయంత్రం 6 గంటలకు దీపాన్ని వెలిగించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ధిక్కరించిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు, హిందూ సంఘాల కార్యకర్తలు కొండ కింద పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు తిరుప్పరంకుండ్రం కొండ, పరిసర ప్రాంతాల్లో 5,600 మందికిపైగా పోలీసులను మోహరించారు. అంతకుముందే రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలు, హిందూ సంఘాల కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, మంగళవారం మధ్యాహ్నం ఈ వ్యవహారాన్ని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విచారించి కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి, దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివాదం ఏంటంటే..?
మదురై జిల్లాలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాదుషా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న పురాతన రాతి స్తంభం (దీపతూన్) పై కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఆ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. భవిష్యత్తు హక్కులకు ఆధారం కాదనే షరతుతో కేవలం ఈ ఏడాది పరిమిత సంఖ్యలో ఆలయ ప్రతినిధులు ఆ స్తంభంపై దీపం వెలిగించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
