దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అర్థరాత్రి ఓ యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు దుండగులు. ప్రీత్ విహార్ ప్రాంతంలోని ఓ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. సహకరించిన ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుల్లో కొందరు కర్కార్డూమాలోని క్రాస్ రివర్ మాల్లో ఉన్న కేఫ్ 8లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి బాధితురాలితో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రీత్ విహార్‌లోని సల్తానాతే కేఫ్‌లో పార్టీ చేసుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పార్టీ ముగించుకుని అందరూ బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, కొందరు మహిళలు వారికి సహకరించారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
