- వంద సీట్లు కావాలంటున్న జాతీయ పార్టీ
- సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలపై కీలక చర్చలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ సుమారు 100 సీట్లు కోరుతుండగా, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మాత్రం కేవలం 26 సీట్లను మాత్రమే ప్రతిపాదించినట్లు సమాచారం. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ఢిల్లీ నివాసంలో తొలి దఫా సీట్ల సర్దుబాటు సమావేశం జరిగింది.
2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండియా కూటమి భాగస్వాములతో చర్చించేందుకు ఎస్పీ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఈ భేటీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత చర్చల ప్రాతిపదికగా ఈ సీట్లపై సమాలోచనలు జరుగుతున్నాయని నేతలు చెబుతున్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల సున్నితత్వాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ మరింత సరళంగా వ్యవహరించాలని మా వినతి. ఇద్దరం కలిసి ముందుకు వెళ్లాలని దేశ, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు’ అని ఎస్పీ నేత రామ్జీ లాల్ సుమన్ వ్యాఖ్యానించారు.
అవసరమైతే ఒంటరిపోరు..
ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ బలం పెరిగిందని, ఈసారి తమకు కనీసం 70 నుంచి 80 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎస్పీ ప్రతిపాదించిన 26 సీట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని ఎస్పీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అగ్రనేతలు మరోసారి సమావేశం కానున్నారు. ఈ చర్చల తర్వాతే పొత్తుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీట్ల పంపకాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గత ఎన్నికల గణాంకాలు
2017 మరియు 2022 ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత ఎస్పీ ఈసారి పుంజుకోవాలని చూస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. 347 స్థానాల్లో పోటీ చేసిన ఎస్పీ 111 చోట్ల గెలవగా, 399 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ 2 సీట్లకే పరిమితమైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసిన 62 స్థానాల్లో ఎస్పీ 37 చోట్ల, 17 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించాయి.
