నీళ్ల పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్  సెంటిమెంట్  డ్రామాలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

నీళ్ల పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్  సెంటిమెంట్  డ్రామాలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 
  •     299 టీఎంసీలకే బీఆర్ఎస్ ఎందుకు సంతకం పెట్టింది?
  •     కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసీఆర్​కు పట్టిన గతే కాంగ్రెస్​కు..
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శ 


హైదరాబాద్, వెలుగు: కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికీ పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పుడు నీళ్ల పేరుతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణతో పాటు కర్నాటకలోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోతుందని అన్నారు. 90 సీట్లు గెలుస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలకు.. అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతవుతాయనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రావాల్సిన 512 టీఎంసీలకు బదులు 299 టీఎంసీలకే బీఆర్ఎస్ ఎందుకు అంగీకరించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు సుమారు రూ.13 లక్షల కోట్ల నిధులిచ్చిందని తెలిపారు. కేంద్రం ఏమిచ్చిందంటూ గతంలో తప్పుడు ప్రచారం చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు అదే దారిలో వెళ్తున్న కాంగ్రెస్‌కూ గుణపాఠం తప్పదన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే ముందు నియోజకవర్గాల అభివృద్ధికి మంత్రులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీని అడ్డుకోవడానికి ఒక్కటవుతున్నయ్

బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమవుతున్నాయని రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ మోసగాడు సినిమా తరహాలో పాలిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ మోసగాళ్లకు మోసగాడిలా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి సాగదనే భయంతోనే ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్‌లో జరిగిన మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. మెట్రో విస్తరణకు కేంద్ర నిధులు కోరే ముందు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత ఫార్మాట్‌లో డీపీఆర్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వివరాలు సమర్పించాలని సూచించారు. ప్రతిపాదనలు పంపకుండా కేంద్రంపై నెపం నెట్టడం సరికాదన్నారు.

సబ్‌రీజినల్ పార్టీగా కాంగ్రెస్

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాభవం కోల్పోయి సబ్‌రీజినల్ పార్టీగా మిగిలిందని రాంచందర్ రావు విమర్శించారు. యూపీ, తమిళనాడు, కేరళలో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతూ రాహుల్‌ను ప్రధాని చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ విదేశాల్లో విమర్శలు చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ పూర్తిగా ఎన్నికల సంఘం చేపడుతున్న స్వతంత్ర రాజ్యాంగ ప్రక్రియ అని, ఇందులో కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త లావణ్య కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో గౌతం రావు, మాధవి, ఎన్వీ సుభాష్, రవి నాయక్, రాజు పాల్గొన్నారు.