గత ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు శాపం..కాళేశ్వరం వైఫల్యం, పోతిరెడ్డిపాడు విస్తరణకు BRSకారణం

 గత ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు శాపం..కాళేశ్వరం వైఫల్యం, పోతిరెడ్డిపాడు విస్తరణకు BRSకారణం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఖమ్మం, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రైతులకు శాపంగా మారాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 570 నుంచి 575 టీఎంసీల వాటా రావాల్సి ఉండగా, కేవలం 298 టీఎంసీలకే అంగీకరించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ఆరోపించారు. కృష్ణా ఆయకట్టు రైతులకు మరణశాసనం రాసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు.

 మంగళవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, అప్పట్లో ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆధారాలతో సహా వివరాలు వెల్లడించినా, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు సమాధానం చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీల వైఫల్యానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశాలు దెబ్బతిన్నాయని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంతో వాటిపై ఆధారపడిన ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. 

గత పదేళ్లలో సాగులోకి తెచ్చిన భూముల వివరాలు కాకుండా, వాస్తవంగా ఎన్ని ఎకరాలకు నీరందించారో చెప్పాలని హరీశ్‌‌‌‌రావును డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన జలయజ్ఞం ప్రాజెక్టుల ఘనతను కూడా గత ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని విమర్శించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై భారీగా నిధులు ఖర్చు చేస్తోందని, తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. రైతులు, పేదలు, నిరుద్యోగుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఏదులాపురం మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ అనిత, కమిషనర్ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఆఫీసర్లు పాల్గొన్నారు.