భక్త జన సంద్రం.. కొండగట్టు అంజన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు

భక్త జన సంద్రం..  కొండగట్టు అంజన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • ఏర్పాట్లలో ఆఫీసర్లు విఫలం 
  • యాదగిరిగుట్ట ఆలయం నుంచి పట్టువస్త్రాల సమర్పణ

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న నిజరూప దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి, గిరిప్రదక్షిణ, సెలవు రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శనాన్ని అవకాశం కల్పించారు. ఈ ఒక్కరోజే సుమారు లక్ష మంది జనం అంజనను దర్శించుకున్నట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. 

రూ.20 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. కాగా, నిజరూప దర్శనంలో భాగంగా ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలను తీసుకొచ్చి సమర్పించారు. యాదగిరిగుట్ట ఏఈవో శ్రవణ్, ప్రధానాచార్యులు సురేంద్రాచారి వచ్చి అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. 

ఏర్పాట్లలో విఫలం.. 

కొండగట్టు అంజన్న దర్శనానికి మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా ఆఫీసర్లు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ఉచిత దర్శనానికి క్యూలైన్లలో నిలబడే భక్తులకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డరు. గంటల తరబడి క్యూలైన్లను నిలిపివేయడంతో సహనం కోల్పోయిన భక్తులు భారీకేడ్లను ధ్వంసం చేసి రాజగోపురం నుంచి ఆలయంలోకి పరుగులు తీశారు. 

దీంతో అంతరాలయం భక్తులతో కిక్కిరిసింది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను నియంత్రించడానికి ఆలయ అధికారులు సుమారు 2 గంటల పాటు రాజగోపురం ప్రధాన ద్వారాలు మూసివేశారు. టికెట్​కౌంటర్లు ఒకచోట, భక్తుల దర్శనాలు మరోచోట ఏర్పాటు చేయడంతో భక్తులు కొంత గందరగోళానికి గురయ్యారు. 

స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులకు ఆహ్వానం అంటూ ప్రచారం చేసిన ఆఫీసర్లు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరో వైపు భక్తుల వెహికల్స్​జేఎన్టీయూ వరకు నిలిచిపోవడంతో కాలినడకన గుట్టకు చేరడానికి భక్తులు అవస్థలు పడ్డారు.