వేర్వేరు చోట్ల విద్యుత్ షాక్ తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఘటనలు

వేర్వేరు చోట్ల విద్యుత్ షాక్ తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఘటనలు

కొండపాక/ ఎల్లారెడ్డిపేట/ ఏటూరునాగారం, వెలుగు : వేర్వేరు చోట్ల విద్యుత్​షాక్​తో నలుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారానికి చెందిన రాగుల దుర్గయ్య (75) గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో పూజలు చేస్తుండేవాడు. రోజూమాదిరిగానే గుడిలో మైక్​ను ఉపయోగించి పాటలు పాడుతుండగా కరెంట్​షాక్​గురై స్పాట్​లో మృతిచెందాడు. చిన్నకోడూరు గ్రామానికి చెందిన చెరుకు నాగరాజు (25) తొలిసారి అయ్యప్ప మాల ధరించాడు. కార్తీక మాసం పురస్కరించుకుని దుద్దేడ గ్రామంలో ఓ ఇంటి వద్ద టెంటు వేస్తుండగా, కరెంటు వైర్లకు ఇనుప పైపులు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన మాచర్ల నర్సయ్య అదే గ్రామానికి చెందిన రైతు వెంట్రామిరెడ్డి పొలాన్ని కౌలుకు చేస్తున్నాడు. ఈ క్రమంలో నారు పోయిన సదరు రైతు పందులు రాకుండా కరెంట్​తీగలు​ఏర్పాటు చేశాడు. అదే గ్రామానికి చెందిన రేపాక రమేశ్​(28)ను నారు వేసిన మడి గలమ తీయమని నర్సయ్య చెప్పి పంపించాడు. కరెంట్​ తీగలు అమర్చిన విషయం చెప్పక పోవడంతో పొలం వద్దకు వెళ్లిన రమేశ్​చెయ్యికి ప్రమాదవశాత్తు కరెంట్​ తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా చనిపోయి పడివున్నాడు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన యువరైతు షేక్​బషీర్​(40) పొలంలో బోరు మోటార్​కు సంబంధించిన పనులు చేస్తుండగా షాక్​తగిలి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.