‘‘ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు కదలరా ముందుకు అటో ఇటో ఎటు వైపు..’’ సాంగ్ గుర్తుందా.. అంకురం సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన మోటివేషనల్ సాంగ్.. ఇప్పుడు మనం చెప్పబోతున్న రైతుకు సరిగ్గా సరిపోతుంది.. తాను ఒక అడుగు వేస్తే.. తన వెంట ఎవరో ఒకరు ముందుకు కదలకపోరా అనే విశ్వాసంతో ఈ రైతు తీసుకున్న నిర్ణయం ఆ ఊరి రూపు రేఖలనే మార్చేసింది.. సొంత డబ్బులతో ఓ మంచి పనికి అతను వేసిన మొదటి అడుగుకు ఎన్నో అడుగులు తోడయ్యాయి.. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా అడుగు వేసేందుకు వీలులేని స్థితిలో ఉన్న రోడ్డు ఇప్పుడు అద్దంలా మెరుస్తోంది.. రోడ్డు బాగు కావడంతో రాకపోకలు మెరుగవడంతో ఊరూ ఊరంతా సంతోషం వ్యక్తం చేస్తోంది.. రూ.2 లక్షల సొంత ఖర్చుతో దరిద్రమైన రోడ్డును బాగు చేసి ఊరి అభివృద్ధికి కొత్త బాటలు వేసిసన రైతు కథ ఇప్పుడు తెలుసుకుందాం..
మైసూరు, వెలుగు: అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కర్ణాటకకు చెందిన ఒక రైతు సామాజిక బాధ్యతగా ముందుకొచ్చారు. కన్నడ ప్రభ నివేదిక ప్రకారం..మైసూరు జిల్లా హెచ్డీ కోటె ప్రాంతానికి చెందిన ఎస్. నాగభూషణ అనే రైతు తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ.2 లక్షలు ఖర్చు చేసి, రైతులు, స్థానికులకు ప్రధాన రవాణా మార్గంగా ఉన్న పూర్తిగా దెబ్బతిని నడిచేందుకు కూడా యోగ్యంగా లేని రోడ్డును బాగు చేశారు.
రామనగర జిల్లా జలమంగళ గ్రామానికి చెందిన నాగభూషణ ఆరు నెలల క్రితం హెచ్డీ కోటెకు తరలివచ్చారు. అక్కడ ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం ప్రారంబించారు. అయితే కపిల నది సమీపంలోని ప్రధాన మార్గానికి కలిపే మూడు కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా ఉండేది. దీనివల్ల పొలాల నుంచి పంటను తరలించడానికి, ఎరువులు, విత్తనాలు తీసుకురావడానికి రైతులకు మూడు గంటల వరకు సమయం పట్టేది.
ఈ సమస్యపై నాగభూషణ స్థానిక గ్రామ పంచాయతీని సంప్రదించారు. అయితే ఆ రోడ్డు కావేరీ నీరవారి నిగమ లిమిటెడ్ పరిధిలోకి వస్తుందని అధికారులు చెప్పారు. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నాగభూషణ సొంతంగా రోడ్డును బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట ఒక ఎర్త్మూవర్ను అద్దెకు తీసుకుని పనులు మొదలుపెట్టారు.
రైతు చొరవను చూసి ఇతర గ్రామస్థులు కూడా సహాయం అందించారు. బసవరాజు అనే నివాసి రూ.10 వేలు, గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ రూ.15 వేలతో పాటు మట్టిని తరలించడానికి ఒక ట్రాక్టర్ను ఇచ్చారు. సమీపంలోని ఒక రిసార్ట్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించింది. పనులను సమన్వయం చేసేందుకు నాగభూషణ ‘హలే హైరిగే రాస్తేయ దురస్తి టీమ్’ అనే బృందాన్ని ఏర్పాటు చేశారు.
మరమ్మతులకు 40 ట్రక్కుల కంకర రాళ్లు, 60 టిప్పర్ల ఇసుకను వాడారు. ఒక నెల పాటు శ్రమించి రోడ్డును వినియోగంలోకి తెచ్చారు. రోడ్డు బాగు కావడంతో ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.40 లక్షలు ఉన్న భూమి ధర రూ.70 లక్షలకు చేరిందని నాగభూషణ తెలిపారు. రవాణా సౌకర్యం పెరగడంతో బసవరాజు అనే మరో రైతు తన పొలంలో పట్టుపురుగుల పెంపక కేంద్రాన్ని ప్రారంభించారు. పాత నీటిపారుదల కాలువలను కూడా బాగు చేయాలని నాగభూషణ ఇప్పుడు యోచిస్తున్నారు.
