AIకి ట్రైనింగ్ ఆపండి.. కంట్రోల్ చేయలేకపోతున్నాం: నెత్తీనోరు బాదుకుంటున్న ఉద్యోగులు

AIకి ట్రైనింగ్ ఆపండి.. కంట్రోల్ చేయలేకపోతున్నాం: నెత్తీనోరు బాదుకుంటున్న ఉద్యోగులు

AI రంగంలో టాప్ కెంపెనీలైన ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ అంతర్గతంగా భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక ఏఐ మోడల్స్‌ని కంట్రోల్ చేసేందుకు ఇంజనీర్లు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొత్త మోడల్స్ తయారీ ట్రైనింగ్ నిలిపివేయాలని ఆ కంపెనీల్లో పనిచేస్తున్న ఏఐ టెక్కీలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ రెండు కంపెనీలకు చెందిన సుమారు 24 మందికి పైగా ఉద్యోగులు అంతర్గత చర్చల్లో పాల్గొని ఏఐ మోడళ్ల భద్రతా అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారని యాక్సియోస్ రిపోర్ట్ చేసింది. కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చని కొందరు భావిస్తుంటే.. కొత్త మోడల్స్ ట్రైనింగ్ పూర్తిగా ఆపివేయాలని మరికొందరు సూచిస్తున్నారు. గణితం, సైన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ కంటే ల్యాబ్స్‌లో తయారై విడుదల కాని మోడల్స్ చాలా శక్తిమంతంగా ఉన్నాయట. శక్తివంతమైన ఏఐ మోడళ్ల ప్రవర్తనను నియంత్రించడానికి ఇంజనీర్లకు ఇప్పటి వరకు సరైన సాంకేతిక పరిష్కారాలు దొరకలేదంట. దీంతో వాటిని అదుపుతప్పకుండా ఎలా అడ్డుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అందుకే ఇప్పటికే తయారు చేసిన వాటిని నియంత్రించలేకపోతోంటే ఇంకా కొత్తకొత్త పవర్‌ఫుల్ ఏఐ మోడళ్లను తయారు చేయెుద్దంటూ కంపెనీలకు మెురపెట్టుకుంటున్నారు. 

రియిన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ పద్ధతిలో ఏఐ మోడల్స్ శిక్షణ పొందుతాయి. అయితే ఎక్కువ స్కోర్లు సాధించడానికి ఏఐ వ్యవస్థలు రివార్డ్ సిస్టమ్‌ను తారుమారు చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటి ద్వారా భద్రతాపరమైన నిబంధనలను కూడా ఏఐ మోడల్స్ దాటేస్తున్నాయి. ఏఐ ఆలోచనా ప్రక్రియను పర్యవేక్షించడం మరో సవాలుగా మారింది. సాధారణంగా ఏఐ తన ఆలోచనలను వివరించడం ద్వారా ప్రమాదకరమైన ప్రవర్తనను గుర్తించవచ్చు. కానీ కొన్ని అధునాతన వ్యవస్థలు తమ ఆలోచనలను దాచిపెడుతున్నాయని, తప్పుడు వివరణలు ఇస్తున్నాయని నివేదిక తెలిపింది. దీనివల్ల ఏఐ తీసుకునే నిర్ణయాలను మానవులు అర్థం చేసుకోవడం కష్టమవుతోంది.

ALSO READ : అసలు 'కోడ్ రెడ్' అంటే ఏంటి? భారీ ఔటేజ్ తర్వాత మైక్రోసాఫ్ట్ కొత్త ప్లాన్ ఇదే!

విడుదల కాని ఆంత్రోపిక్ క్లాడ్ మోడల్ ఒక గణిత శాస్త్రవేత్తకు రీమాన్ పరికల్పన నిరూపణలో సాయపడింది. ఓపెన్ ఏఐ మోడల్ వందలాది గణిత సమస్యలకు పరిష్కారాలు చూపింది. అయితే ఈ మోడల్స్ వల్ల హగ్గింగ్ ఫేస్ హ్యాక్ వంటి భద్రతాపరమైన సంఘటనలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. వ్యాపార ప్రయోజనాల కోసం ఏఐ భద్రతను కంపెనీలు విస్మరిస్తాయేమోనని కొందరు ఉద్యోగులు భయపడుతున్నారు. అయితే భద్రతా నిబంధనల వల్ల కొత్త మోడల్స్ విడుదల ఆలస్యం కావచ్చని ఓపెన్ ఏఐ ప్రతినిధి చెప్పారు. ఆంత్రోపిక్ సంస్థ కూడా వ్యాపార పరంగా నష్టం వచ్చినా భద్రతకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.