వృద్ధాశ్రమంలో ప్రేమ పుట్టింది.. ఆ తర్వాత పెళ్లి : అతనికి 75, ఆమెకు 63..

వృద్ధాశ్రమంలో ప్రేమ పుట్టింది.. ఆ తర్వాత పెళ్లి : అతనికి 75, ఆమెకు 63..

అతని వయస్సు 75.. పేరు కన్హయ్య లాల్. ఆమె వయస్సు 63 ఏళ్లు.. పేరు సబీనా. వీరిది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. నాలుగేళ్లుగా అక్కడే.. వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది.. నాలుగేళ్ల లవ్ తర్వాత.. వృద్ధాశ్రమంలోనే వీరు పెళ్లి చేసుకున్నారు. అది కూడా లీగల్ గా.. రిజిస్టర్ మ్యారేజ్.. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటి అయ్యారు.. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఎక్కడెక్కడో తిరిగి.. చివరికి నీడ కోసం ఓ వృద్ధాశ్రమంలో చేరిన తర్వాత.. వీళ్లిద్దరూ ఒక్కటి కావటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఓల్డేజ్ హోంలోని ఈ లవ్ అండ్ మ్యారేజ్ కథ ఏంటో తెలుసుకుందామా...

75 ఏళ్ల కన్హయ్య లాల్, 63 ఏళ్ల సబీనా నవంబర్ 25న అంటే ఈ రోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇద్దరూ ప్రస్తుతం ఘాఘాస్ ప్రాంతంలోని దయోలి గ్రామంలో ఉన్న అప్నా ఘర్ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. అక్కడే పరిచయమైన వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఒకరికొకరు అండగా ఉంటూ, మిగిలిన జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు.

ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న కన్హయ్య లాల్
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా తునాగ్ ప్రాంతానికి చెందిన కన్హయ్య లాల్ జీవితం ఒకప్పుడు సాధారణంగానే సాగేది. భార్యతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. అయితే అనారోగ్యంతో భార్య చనిపోవడంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో, తనకున్న వ్యవసాయ భూమిని సోదరులకు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి. బంధువుల నుంచి సరైన ఆదరణ లభించకపోవడంతో ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది.

చివరకు ఉండటానికి చోటు లేక అడవిలోని ఓ గుహలో ఆశ్రయం పొందాడు. ఈ విషయం తెలుసుకున్న వారు 2022లో ఆయనను దయోలిలోని అప్నా ఘర్ వృద్ధాశ్రమానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ జీవితం కొనసాగిస్తున్నాడు.

సబీనా జీవితంలోనూ ఎన్నో కష్టాలు
కోల్‌కతాకు చెందిన 63 ఏళ్ల సబీనా జీవితం కూడా ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. ఒకసారి హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా సమీపంలో ఉన్న మషోబ్రాలో ఆమె కనిపించడంతో పోలీసులు గుర్తించి రక్షించారు.

ఆ తర్వాత ఆమెను మషోబ్రాలోని నారీ నికేతన్‌కు తరలించారు. అక్కడ దాదాపు నాలుగేళ్ల పాటు ఉన్నట్లు సమాచారం. అనంతరం 2025లో బిలాస్‌పూర్ జిల్లాలోని దయోలిలో ఉన్న అప్నా ఘర్ వృద్ధాశ్రమానికి తీసుకొచ్చారు. అక్కడే ఆమెకు కన్హయ్య లాల్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకే చోట ఉంటూ ఒకరి కష్టాలను మరొకరు అర్థం చేసుకున్నారు.

స్నేహం కాస్తా ప్రేమగా మారింది
వృద్ధాశ్రమంలో కలిసి ఉంటున్న క్రమంలో కన్హయ్య లాల్, సబీనా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రోజు చేసే  పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కష్టాల్లో తోడుగా ఉండటం మొదలుపెట్టారు.

ఇద్దరూ వారి జీవితాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఒకరికొకరు పరిచయం కావడం, ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారడం వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపింది.

రోజులు గడిచేకొద్దీ వారి మధ్య అనుబంధం మరింత పెరిగింది. మిగిలిన జీవితాన్ని కూడా ఇలాగే కలిసి గడిపితే బాగుంటుందని ఇద్దరూ భావించారు. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని వృద్ధాశ్రమం నిర్వాహకులకు తెలియజేశారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్న నిర్వాహకులు కూడా పెళ్లికి అంగీకరించి ఏర్పాట్లు ప్రారంభించారు.

నవంబర్ 25న పెళ్లి.. వృద్ధాశ్రమంలోనే వేడుకలు
దయోలిలోని అప్నా ఘర్ వృద్ధాశ్రమాన్ని స్థాపించిన న్యాయవాది ప్రకాష్ బన్సల్ ఈ జంటతో మాట్లాడినట్లు సమాచారం. ఇద్దరూ తమకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందని ఆయనకు స్పష్టంగా చెప్పారు.

వారి నిర్ణయాన్ని గౌరవించిన ఆశ్రమం నిర్వాహకులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా కోర్టు మ్యారేజ్ చేసుకుని, ఆ తర్వాత నవంబర్ 25న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుక నిర్వహించనున్నారు.

ALSO READ : శుక్ర, గురు గ్రహాల మధ్య 60 డిగ్రీల కోణం..

పెళ్లి తర్వాత ఈ జంటను నలగఢ్‌లోని మరో వృద్ధాశ్రమానికి తరలించనున్నారు. అక్కడ ఇద్దరూ కలిసి ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నలగఢ్‌లో కొత్తగా వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు న్యాయవాది ప్రకాష్ బన్సల్ కూడా వెల్లడించారు.

మొత్తానికి, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒంటరిగా మిగిలిపోయిన ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు తోడుగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. వయసు ఎంత పెరిగినా ప్రేమకు, తోడు కావాలనే కోరికకు అడ్డుకట్ట లేదని కన్హయ్య లాల్, సబీనా కథ మరోసారి గుర్తుచేస్తోంది.