బెంగళూరు నగరంలోని హోటళ్లు, పబ్లు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ధూమపానాన్ని పూర్తిగా నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. నగరవ్యాప్తంగా స్మోకింగ్ ఫ్రీ జోన్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ పబ్లిక్ హెల్త్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం పరిశీలిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై కఠిన నియంత్రణలు ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ ఈ ప్రతిపాదనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. ఆ తర్వాతే నిషేధం అమలుపై కన్నడ ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు హోటళ్లు, ఐటీ కంపెనీల క్యాంపస్‌లలో ధూమపానం కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి. అయితే ఈ గదుల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించకుండా ఆపలేమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆతిథ్య రంగంలోని బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్మోకింగ్ జోన్లను పూర్తిగా తొలగించాలని కమిటీ సూచించింది. కార్పొరేట్, ఐటీ క్యాంపస్‌లలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. దీనివల్ల ధూమపానం చేయని ఉద్యోగులపై పొగ ప్రభావం పడకుండా చూడవచ్చని పేర్కొంది.
పరోక్ష ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సిగరెట్ పొగ తాగే వారికే కాకుండా వారి పక్కన ఉండేవారికి కూడా హాని కలిగిస్తుందని అంటున్నారు. ఈ పొగ పీల్చడం వల్ల క్యాన్సర్, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని కమిటీ తెలిపింది.
