ఇందిరమ్మ ఇళ్లకు RERA అనుమతి.. ఇక బ్యాంకు లోన్లు పొందొచ్చు.!

ఇందిరమ్మ ఇళ్లకు RERA అనుమతి.. ఇక బ్యాంకు లోన్లు పొందొచ్చు.!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ హౌసింగ్ పథకం లబ్ధిదారులకు శుభవార్త. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ హౌసింగ్ టవర్లలోని ఫ్లాట్ల కోసం లబ్ధిదారులు ఇకపై బ్యాంకు రుణాలు పొందేందుకు మార్గం సుగమమైంది. మలక్‌పేట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ప్రతిపాదించిన రెండు హౌసింగ్ టవర్లకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) అనుమతి లభించింది. రాష్ట్రంలో ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు RERA నుంచి అనుమతి రావడం ఇదే తొలిసారి.

రెండు టవర్లకు RERA అనుమతి

మలక్‌పేట, కుత్బుల్లాపూర్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ హౌసింగ్ టవర్లకు RERA రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు సోమవారం (నవంబర్ 23) వెల్లడించారు. ఈ అనుమతుల ద్వారా ఆయా ఫ్లాట్ల లబ్ధిదారులకు బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేసేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.అయితే ఈ రెండు టవర్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఇందిరమ్మ హౌసింగ్ టవర్లకు కూడా RERA అనుమతుల కోసం హౌసింగ్ బోర్డు దరఖాస్తు చేసుకుంది.

ORR పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఫ్లాట్లు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ టవర్ల ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల నుంచి జూలై 21న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. అనంతరం ఆగస్టు నుంచి లబ్ధిదారుల ఎంపికకు లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు.

ALSO READ: మరో చారిత్రక కట్టడం కనుమరుగు..నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కూల్చివేతలు

తాజాగా రెండు టవర్లకు RERA అనుమతులు రావడంతో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఏర్పడింది. మిగతా ప్రాంతాల్లోని ప్రతిపాదిత టవర్లకు కూడా అనుమతులు లభిస్తే మరింత మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.