సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే టైమ్ మెషీన్ లాంటి ఒక అద్భుతమైన పరికరం, మన పూర్వీకుల వద్ద 2వేల ఏళ్ల క్రితమే ఉండేదని చెబితే మీరు నమ్ముతారా? కేవలం ఒక హ్యాండిల్ తిప్పితే చాలు.. సూర్యచంద్రుల గమనం, గ్రహాల స్థితిగతులు, గ్రహణాలు ఎప్పుడు వస్తాయో కచ్చితంగా లెక్కగట్టే ఆ ప్రాచీన అద్భుతమే 'యాంటికిథెరా మెకానిజం'. ప్రపంచపు మొట్టమొదటి అనలాగ్ కంప్యూటర్‌గా శాస్త్రవేత్తలు పిలుచుకునే ఈ మిస్టరీ మెషీన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో తెలుసుకుందాం రండి..
సముద్ర గర్భంలో దాగిన అద్భుతం:
క్రీస్తుపూర్వం 60వ సంవత్సరంలో గ్రీస్‌లోని యాంటికిథెరా అనే ద్వీపం వద్ద ఒక భారీ ఓడ తుఫానుకు చిక్కి సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 2 వేల ఏళ్ల పాటు ఆ ఓడ శిథిలాలు సముద్ర గర్భంలోనే ఉండిపోయాయి. 1900వ సంవత్సరంలో కొందరు గజ ఈతగాళ్లు సముద్రంలో స్పాంజీల కోసం వెతుకుతూ అనుకోకుండా ఆ ఓడను గుర్తించారు. గ్రీస్ ప్రభుత్వం సహాయంతో వారు సముద్రం అడుగుకు వెళ్లి అద్భుతమైన పాలరాతి విగ్రహాలు, బంగారు ఆభరణాలు, నాణేలను వెలికితీశారు. వాటితో పాటు షూ బాక్స్ పరిమాణంలో తుప్పు పట్టిన ఒక ఇనుప ముద్ద కూడా బయటపడింది. విగ్రహాల అందానికి ముగ్ధులైన అందరూ.. ఆ తుప్పు ముద్దను పట్టించుకోకుండా పక్కన పడేశారు.
మ్యూజియంలో బయటపడ్డ అసలు నిజం:
సముద్రం నుంచి తెచ్చిన వస్తువులన్నీ ఏథెన్స్లోని నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియానికి చేరాయి. 1902లో పురావస్తు శాస్త్రవేత్త వలేరియోస్ స్టెయిస్ ఆ తుప్పు పట్టిన ముద్దను పరిశీలిస్తుండగా.. అందులో గడియారంలో ఉండే పళ్ల చక్రాలు కనిపించడంతో షాక్ అయ్యారు. క్రీస్తుపూర్వం నాటి కాలంలో ఇంతటి క్లిష్టమైన గేర్ సిస్టమ్ ఉండటం అసాధ్యమని అప్పటి నిపుణులు భావించారు. ఎందుకంటే ఆ కాలంలో కేవలం గాలిమరలు, నీటిమరలలో వాడే సాధారణ గేర్లు మాత్రమే గ్రీకులకు తెలుసని అందరూ అనుకునేవారు.
2100 ఏళ్ల నాటి అనలాగ్ కంప్యూటర్:
యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకుడు టోనీ ఫ్రీత్ దాదాపు 25 ఏళ్ల పాటు దీనిపై పరిశోధనలు చేసి, దీని పనితీరును చూసి "ఇది నమ్మశక్యం కాని మేధస్సు" అని కొనియాడారు. చెక్క పెట్టెలో అమర్చిన ఈ కంచు పరికరంలో ఒక మిల్లిమీటర్ పొడవున్న పళ్లతో కూడిన గేర్ల అమరిక ఉంది. దీనిపై తేదీని సెట్ చేసి పక్కనున్న హ్యాండిల్ తిప్పితే.. ఆ చక్రాలు లెక్కలు వేసి సూర్య, చంద్ర గ్రహణాల తేదీలను, గ్రహాల స్థానాన్ని, చివరికి ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు జరుగుతాయో కూడా కచ్చితంగా చూపించేవి. క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో ఒక బెస్ట్ వర్క్‌షాప్‌లో నెలల తరబడి శ్రమించి వీటిని తయారు చేసి ఉంటారని చరిత్రకారుడు అలెగ్జాండర్ జోన్స్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో పాడైపోయిన లోహపు వస్తువులను కరిగించి మళ్లీ వాడేవారు కాబట్టి.. మిగిలినవి కనుమరుగై, సముద్రంలో మునిగిన ఈ ఒక్క పరికరం మాత్రమే మనకు మిగిలింది.
ALSO READ : దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు
ఖగోళ శాస్త్రం నుంచి యంత్ర మేధస్సు వరకు:
ఈ అద్భుత ఆవిష్కరణ వెనుక ఎందరో ప్రాచీన మేధావుల కృషి ఉంది. బాబిలోనియన్లు, ఈజిప్షియన్ల ఖగోళ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న గ్రీకు తత్వవేత్తలు ప్రకృతి అనేది దేవుళ్ల కోపతాపాలపై కాకుండా.. కొన్ని ఖచ్చితమైన నియమాల ప్రకారం నడుస్తుందని నమ్మారు. క్రీస్తుపూర్వం 585లోనే సూర్యగ్రహణాన్ని అంచనా వేసిన థేల్స్ ఆఫ్ మిలేటస్, విశ్వాన్ని సంఖ్యలతో వివరించవచ్చని చెప్పిన పైథాగరస్ ఆలోచనలే ఇలాంటి యంత్రాన్ని తయారు చేయడానికి పునాది వేశాయి.
మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి?
యాంటికిథెరా మెకానిజం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. సాంకేతికత ఎప్పుడూ ఒకే సరళరేఖలో ముందుకు సాగదు. మన పూర్వీకులు మనం ఊహించిన దానికంటే ఎంతో తెలివైనవారు. ఇంతటి అద్భుతమైన యంత్రాన్ని గ్రీకులు 2100 ఏళ్ల క్రితమే నిర్మించినప్పటికీ.. ఆ తర్వాత వందల ఏళ్ల వరకు అలాంటి సాంకేతికత మళ్లీ ప్రపంచంలో కనిపించలేదు. అంటే మానవ మేధస్సు సాధించిన ఎన్నో గొప్ప ఆవిష్కరణలు కాలగర్భంలో కలిసిపోయాయన్నమాట. సముద్రం అడుగున దొరికిన ఈ చిన్న యంత్రం గతం తాలూకు అద్భుత మేధస్సుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.
