అసలు 'కోడ్ రెడ్' అంటే ఏంటి? భారీ ఔటేజ్ తర్వాత మైక్రోసాఫ్ట్ కొత్త ప్లాన్ ఇదే!

అసలు 'కోడ్ రెడ్' అంటే ఏంటి? భారీ ఔటేజ్ తర్వాత మైక్రోసాఫ్ట్ కొత్త ప్లాన్ ఇదే!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన హిస్టరీలోనే అత్యంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొని సంస్థలో 'కోడ్ రెడ్' ప్రకటించింది. సాధారణంగా టెక్ కంపెనీల్లో కోడ్ రెడ్ అంటే అత్యంత ప్రమాదకరమైన అత్యవసర పరిస్థితి అని అర్థం. సంస్థ మనుగడకు లేదా ప్రతిష్టకు భారీ ముప్పు వాటిల్లినప్పుడు.. మిగతా సాధారణ పనులన్నింటినీ పక్కన పెట్టి, ఇంజనీరింగ్ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన కేవలం ఆ సమస్యను పరిష్కరించడంపైనే ఫోకస్ పెట్టడాన్ని 'కోడ్ రెడ్' అని అంటారు.

నవంబర్ 12-13 తేదీల్లో మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన 24 గంటల భారీ అంతరాయం ఈ నిర్ణయానికి దారితీసింది. జూలై నెలలో విండోస్‌లో ఏర్పడిన ఒక సాంకేతిక లోపాన్ని ముందుగా గుర్తించకపోవడం వల్ల ఈ సంక్షోభం తలెత్తింది. దీనివల్ల అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు, విమానయాన కమ్యూనికేషన్లు, ట్రేడింగ్ సంస్థలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్, అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్ ఏఐ సేవలు నిలిచిపోవడంతో సీఈఓ సత్య నాదెళ్ల బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఈ వైఫల్యం సంస్థలోని ఇంజనీరింగ్ లోపాలను బయటపెట్టిందని అంతర్గత మెమోల ద్వారా వెల్లడైంది. సమస్య తలెత్తినప్పుడు ఇంజనీర్లు 'యుద్ధ మేఘాల' మధ్య గందరగోళంలో పనిచేశారని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అమండా సిల్వర్ పేర్కొన్నారు. వివిధ విభాగాల డేటా చెల్లాచెదురుగా ఉండటంతో.. సమస్యను పరిష్కరించే క్రమంలో 11 టీమ్స్ చాట్‌లలో 11వేలకు పైగా మెసేజ్‌లు పంపుకోవాల్సి వచ్చిందని, ఒక్క రోజులోనే పదేళ్లకు సరిపడా వైఫల్యాలు ఎదురయ్యాయని ఆమె వెల్లడించారు. ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ చరిత్రలో ఇదే అతిపెద్ద వైఫల్యమని M365 కోర్ ప్రెసిడెంట్ జాసన్ హెండర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ : హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్లలో స్మోకింగ్ బ్యాన్

గతంలో అత్యవసర అప్‌డేట్లను ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి 5 నుంచి 6 రోజులు పట్టేదని.. కానీ ఇకపై అలా కుదరదని మైక్రోసాఫ్ట్ తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తితే కేవలం ఒక్క గంటలోనే ప్రపంచవ్యాప్తంగా పరిష్కారం చూపేలా కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం లోడ్ షెడ్డింగ్, ట్రాఫిక్ డివిజన్ వంటి 5 కీలక మార్పులతో పాటు, సిస్టమ్ లోపాలను వేగంగా గుర్తించడానికి ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది.