Miss Universe 2026 : మిస్ యూనివర్స్ 2026గా జెన్నిఫర్ బారెటో.. 3వేల వజ్రాల కిరీటంతో మెరిసిన సుందరి!

Miss Universe 2026 : మిస్ యూనివర్స్ 2026గా జెన్నిఫర్ బారెటో.. 3వేల వజ్రాల కిరీటంతో మెరిసిన సుందరి!

ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠకు తెరపడింది.  ప్యూర్టోరికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో మిస్ యూనివర్స్ 2026గా నిలిచారు. పోటీలు నిర్వహించిన సొంత గడ్డపైనే విశ్వసుందరిగా అవతరించి చరిత్ర సృష్టించారు. 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో 116 మంది అందాల భామలను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. మెక్సికోకు చెందిన మాజీ విశ్వసుందరి ఫాతిమా బోష్ ఆమెకు కిరీటాన్ని అలంకరించారు.

డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ రన్నరప్‌గా నిలవగా, వెనిజులా సుందరి క్లారా వేగాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ ప్రతినిధులు టాప్-5లో చోటు సంపాదించారు. భారత్ తరఫున బరిలోకి దిగిన కజియా లిజ్ మెజో టాప్-30 వరకు చేరుకున్నప్పటికీ.. టాప్-12లోకి అడుగుపెట్టలేకపోయారు.

జెన్నిఫర్ విజయానికి అసలైన ప్రత్యేకత ఆమె వ్యక్తిత్వం, సేవా నేపథ్యం. ఈ బ్యూటీ సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పొందారు. అమెరికా రక్షణ శాఖ పరిధిలోని ఫ్యామిలీ అడ్వకసీ ప్రోగ్రామ్‌లో పనిచేస్తూ గృహహింస, చిన్నారులపై వేధింపుల బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. సంక్షోభ సమయాల్లో కుటుంబాలకు సహకరించడం, నివారణ చర్యలపై నాయకులకు శిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలు నిర్వహించారు. ప్యూర్టోరికోలోని పీడియాట్రిక్ డయాబెటిస్ అసోసియేషన్‌తోనూ సేవా కార్యక్రమాల్లో భాగమయ్యారు.

 

ఈ 75వ ఎడిషన్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ కొత్త కిరీటం. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో రూపొందించిన ఈ కిరీటాన్ని 3,150 మెరిసే వజ్రాలతో అలంకరించారు. జ్యువెలరీ డిజైనర్ జార్జ్ విట్టెల్స్, పారిస్‌కు చెందిన మైసన్ డి ఓర్ కలిసి దీనిని రూపొందించారు. ఫైనల్ ప్రశ్నోత్తరాల సమయంలో నాయకత్వంలో వృత్తిపరమైన సానుభూతి, విలువలకు కట్టుబాటు, సమాజానికి అండగా నిలిచే మనస్తత్వం అవసరమని జెన్నిఫర్ చెప్పిన సమాధానం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

ALSO READ : శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న అల్లు ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్!

భారత్ తరఫున హర్నాజ్ సంధు 2021లో చివరిసారిగా విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. అంతకుముందు 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ ఘనత సాధించారు. ఇప్పుడు మరోసారి ఆ చారిత్రక విజయం కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు...