600 ఏళ్ల గద్వాల సంస్థానం.. నిజాం రాజ్యంలో సంస్థానాల చరిత్ర

600 ఏళ్ల గద్వాల సంస్థానం.. నిజాం రాజ్యంలో సంస్థానాల చరిత్ర

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ఎన్నో సంస్థానాలకు నిలయం. నిజాం రాజ్య పరిధిలో కొనసాగిన ఈ సంస్థానాలు తమకంటూ ప్రత్యేక పాలనా వ్యవస్థలు, రాజధానులు, కోటలు, సైనిక బలగాలను కలిగి ఉండేవి. కొన్ని వందల ఏళ్ల పాటు పాలన సాగించిన సంస్థానాధీశులు యుద్ధవీరులుగానే కాకుండా ఆలయ నిర్మాణాలు, సాహిత్య పోషణ, సంస్కృతి పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానం విస్తీర్ణం, పాలకుల పరాక్రమం, నిర్మాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. మునగాల, పాల్వంచ సంస్థానాలు సైతం తెలంగాణ చరిత్రలో తమదైన ముద్ర వేశాయి. ఇంతకీ ఈ సంస్థానాలను పాలించిన రాజులెవరు? వాటి ప్రత్యేకతలు ఏమిటి? వాటి వెనుక ఉన్న ఆసక్తికర చరిత్రను తెలుసుకుందాం.

గద్వాల సంస్థానం

గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైనది. అతి పెద్దది. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య గద్వాల సంస్థానం ఉండేది. దాదాపు 600 సంవత్సరాల పాలనా కాలం గల ఈ సంస్థానం 1948లో హైదరాబాద్​ రాష్ట్రంలో విలీనమైంది. ఈ సంస్థానంలోని మొత్తం గ్రామాల సంఖ్య 360. గద, వాలు ఆయుధాలను ఉపయోగించి యుద్ధాల్లో శత్రురాజులపై విజయం సాధించేవారు. అందువల్ల వీరు నిర్మించిన నగరానికి గదవాలు నగరం అనే పేరు వచ్చింది. ఆ తర్వాతి కాలంలో గదవాలు, గద్వాలు అయింది. 

గద్వాల సంస్థానాధీశులు పాకనాటిరెడ్లు, ముష్టిపల్లి వంశానికి చెందినవారు. వీరి ప్రథమ రాజధాని పూడూరు. గద్వాల సంస్థానానికి మూల పురుషుడు – బుడ్డారెడ్డి (పోలనిరెడ్డి) గద్వాల సంస్థానానికి ఆద్యుడు – రాజా శోభనాద్రి. వీరు అనుసరించిన మతం – వైష్ణవ మతం. వీరి కుల దైవం – పూడూరులోని చెన్నకేశవస్వామి.  గద్వాల సంస్థానాధీశుల బిరుదులు – నాడగౌడ, సర్ నాడగౌడ. రాజా సోమనాద్రి అతని అసలు పేరు సోమశేఖర ఆనందరెడ్డి. ఈయన గద్వాల సంస్థానానికి ఆద్యుడు, సంస్థాన పాలకుల్లో గొప్పవాడు.  ఇతను గొప్పకవి. ఇతని రచన – గీతాగోవిందం. కాశీలో రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించిన గద్వాల సంస్థానాధీశుడు – రాజా శోభనాద్రి.

1698– 1705 మధ్యకాలంలో ఐజ గ్రామంలో ఒక కోటను నిర్మించాడు. 1725– 1738 మధ్య సోమనాద్రి భార్య రాణి లింగమ్మ గద్వాల సంస్థానాన్ని పరిపాలించింది. బీచుపల్లి వద్ద కృష్ణా నది మధ్యలో ఉన్న ఎత్తయిన కొండపైన ఒక కోటను (జలదుర్గం)ను నిర్మించింది. దీన్నే నిజాంకోట అని పిలుస్తారు.  రాణి లింగమ్మ తర్వాత అతని దత్తపుత్రుడు రాజా తిరుమలరావు 1738– 1742 మధ్యకాలంలో సంస్థానాన్ని పాలించాడు. ఇతను బీచుపల్లి వద్ద ఉన్న నిజాంకోట నిర్మాణం పూర్తిచేశాడు. 

ఇతని అనంతరం ఇతని భార్య రాణి చొక్కమ్మ గద్వాల సంస్థానాన్ని పాలించింది. ఈమె బీచుపల్లిలోని నిజాంకోటలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 
రాణి చొక్కమ్మ మరిది రాజా రామారావు కర్నూలుపైకి దండెత్తి దాని నవాబును ఓడించి బెతండ్లలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. గద్వాల సంస్థాన పాలకులు చాలా మంది కవులను పోషించారు. మాఘ మాసంలో కవి గాయకులను సన్మానం చేసే సంప్రదాయాన్ని రాజా పెద సోమభూపాలుడు ప్రారంభించాడు.  

మునగాల సంస్థానం

ఈ సంస్థానం కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలోనిది. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం 1959లో మునగాల సంస్థానాన్ని నల్గొండ జిల్లాలో చేర్చారు. ఈ సంస్థానం మొదటి రాజధాని రేపాల. మునగాల సంస్థాన రాజా నాయని వెంకట రంగారావు (1900) దగ్గర దివానుగా పనిచేసిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలంగాణలో అనేక గ్రంథాలయాలు ప్రారంభించాడు.  1947లో మునగాల సంస్థానం మద్రాస్ రాష్ట్రంలో విలీనమైంది. 

పాల్వంచ సంస్థానం

ప్రస్తుత భద్రాద్రి జిల్లాలో ఉన్న పాల్వంచ పూర్వం పాల్వంచ లేదా శంకరగిరి సంస్థానంగా ప్రఖ్యాతిగాంచింది. పాల్వంచ సంస్థానం ఆధీనంలో రేఖపల్లి, భద్రాచలం ప్రాంతాలుండేవి. ఈ ప్రాంత రాజధాని పాల్వంచ. వంశం మాచిరాజు వంశం. పాల్వంచ సంస్థానాధీశుల పూర్వీకులు కాకతీయ ప్రతాపరుద్రుని సేనానిలుగా, అశ్వ  సైన్యాధీశులుగాను వ్యవహరించిన పద్మనాయక వంశీయులు. సాహిత్య విశారద అనే బిరుదు గల పాల్వంచ సంస్థాన పాలకుడు పార్థసారథి అప్పారావు.