న్యూయార్క్: యుద్దాల సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త టెక్నాలజీల వినియోగం బాధ్యతాయుతంగా ఉండాలని భారత్ పిలుపునిచ్చింది. టెక్నాలజీ వాడకంలో మానవ విచక్షణ, పర్యవేక్షణే కీలకం అని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మంగళవారం (నవంబర్ 25) జరిగిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతేని మాట్లాడారు. 'వేగవంతమైన సాంకేతిక మార్పుల యుగంలో సంఘర్షణ పరిష్కారం' అనే అంశంపై ఆయన భారత్ తరపున ప్రకటన చేశారు.
వేగవంతమైన సాంకేతిక మార్పు లు అంతర్జాతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని హరీష్ పర్వతేని అన్నారు. ఏఐ, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలు సైనిక రంగంలోకి రావడం వల్ల అపూర్వమైన అవకాశాలతో పాటు కొత్త ప్రమాదాలు పొంచివున్నాయని హెచ్చరించారు. టెక్నాలజీఅనేది కేవలం లక్ష్యాలను సాధించే సాధనం మాత్రమే కావాలని, అది మానవ కేంద్రీకృతంగా ఉండాలని కోరారు. ఏఐ అనేది ఒక అంతిమ లక్ష్యం కాకూడదని చెప్పారు.
శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో ఏఐ, ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ ప్లాట్ఫారంలు సహాయపడతాయని హరీష్ పర్వతేని తెలిపారు. అయితే ఉగ్రవాద గ్రూపులు, ప్రభుత్వేతర శక్తులు ఏఐని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ ద్వారా వచ్చే తప్పుడు డేటా వల్ల తీసుకునే నిర్ణయాలతో ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాంతక మానవ నియంత్రణలేని ఆయుధ వ్యవస్థల విషయంలో మానవ పర్యవేక్షణ అత్యవసరమని, వాటి వినియోగానికి ఎప్పుడూ మానవులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ALSO READ : AIకి ట్రైనింగ్ ఆపండి.. కంట్రోల్ చేయలేకపోతున్నాం
టెక్నాలజీ మార్పుల వల్ల అభివృద్ధి చెందిన దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య అసమానతలు పెరగకూడదని భారత్ కోరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలను కేవలం వినియోగదారులుగా చూడటం సరికాదని రాయబారి అన్నారు. ఏఐ వ్యవస్థలు లింగం, భాష, సామాజిక నేపథ్యానికి సంబంధించిన పక్షపాతాలను కొనసాగించకూడదని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 90కి పైగా దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించాయని, ఏఐ వనరులను ప్రజాస్వామ్యీకరించాలని భారత్ పిలుపునిచ్చిందని హరీష్ పర్వతనేని గుర్తు చేశారు.
