హైదరాబాద్ లో గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న EAGLE అధికారులు పీజీ హాస్టళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఓ మెన్స్ పీజీ హాస్టల్‌లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 8 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా.. ఆరుగురికి గంజాయి పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పీజీ హాస్టళ్లలో గంజాయి వినియోగం జరుగుతున్నట్లు వస్తున్న సమాచారంతో EAGLE అధికారులు నిఘా పెంచారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువత అధికంగా నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గచ్చిబౌలితో పాటు మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని పీజీ హాస్టళ్లపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగం, సరఫరాను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు కొనసాగించే అవకాశం ఉంది.
