మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్.. సంక్రాంతి బరిలోకి 'విశ్వంభర'? 'కాకా'తో పోటీ తప్పదా?

మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్.. సంక్రాంతి బరిలోకి 'విశ్వంభర'? 'కాకా'తో పోటీ తప్పదా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ 'విశ్వంభర' సినిమా రిలీజ్ తేదీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ సినిమా, టీజర్‌లోని గ్రాఫిక్స్‌పై విమర్శలు రావడంతో మరింత నాణ్యమైన విజువల్ ఎఫెక్ట్స్ అందించేందుకు చిత్రబృందం మరింత సమయం తీసుకుంటోంది. దాదాపు రెండేళ్లుగా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు లేటెస్ట్ గా వినిపిస్తున్న సంక్రాంతి వార్తలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం 'కాకా' ఇప్పటికే సంక్రాంతి విడుదలను ఖరారు చేసుకుంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు బాబీ కూడా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో 'విశ్వంభర' కూడా సంక్రాంతి బరిలోకి వస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ రెండు సినిమాలు ఒకే సీజన్‌లో విడుదలైతే మెగాస్టార్ అభిమానులకు డబుల్ ధమాకా ఖాయం. కానీ ఒకే హీరో సినిమాలు వెంటవెంటనే విడుదల కావడం బాక్సాఫీస్ పరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

 

మరోవైపు 'విశ్వంభర' ఆలస్యానికి ప్రధాన కారణం భారీ సీజీ, వీఎఫ్ఎక్స్ పనులేనని నటుడు రాజీవ్ కనకాల ఇటీవల వెల్లడించారు. మెగాస్టార్ స్థాయికి తగ్గట్టుగా విజువల్స్ ఉండాలనే ఉద్దేశంతోనే మేకర్స్ జాగ్రత్త పడుతున్నారని తెలిపారు.  వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, సురభి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ALSO READ : డబ్బే ముఖ్యం.. నా సత్తా ఏంటో చూపిస్తా..

మరి 'విశ్వంభర' సంక్రాంతికి వస్తుందా? లేక 'కాకా'కు సోలో రిలీజ్ దక్కుతుందా? ఈ ప్రశ్నలకు 'విశ్వంభర'  మేకర్స్ అధికారిక ప్రకటనతోనే సమాధానం దొరకనుంది. అప్పటివరకు మెగా అభిమానులకు ఈ సస్పెన్స్ తప్పేలా లేదు ..