హైదరాబాద్: బాచుపల్లిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లో విషాదం చోటుచేసుకున్న ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (HRC) స్పందించింది. సెప్టిక్ ట్యాంక్, ఎస్టీపీ సంప్ శుభ్రం చేస్తూ విషవాయువులు పీల్చడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనను కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.
కమిషన్ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. నవంబర్ 25న పలు పత్రికల్లో ప్రచురితమైన న్యూస్ ఆధారంగా చేసుకుని కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తగిన భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు లేకుండానే కార్మికులతో శుభ్రపరిచే పనులు చేయించడంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం, రక్షణ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టనుంది.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, భద్రతా నిబంధనల అమలు, అపార్ట్‌మెంట్ యాజమాన్యం, కాంట్రాక్టర్ బాధ్యతలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మున్సిపల్ పరిపాలన శాఖ ప్రభుత్వ కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. అలాగే ఘటనపై చేపట్టిన విచారణ వివరాలు, మృతుల కుటుంబాలకు అందించే సహాయం, ఎక్స్‌గ్రేషియా, ఇతర సంక్షేమ చర్యలపై నివేదిక సమర్పించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ALSO READ : గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో EAGLE సోదాలు..
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చేపట్టిన నివారణ చర్యల వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. సంబంధిత అధికారులు పూర్తి స్థాయి నివేదికలను డిసెంబర్ 22లోగా సమర్పించాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. కార్మికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర పనుల్లో భద్రతా ప్రమాణాల అమలు ఎంతవరకు జరుగుతోందనే అంశం ఈ విచారణతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
