ఏసీబీ అధికారులపైనే అవినీతి ఆరోపణలు.. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ సహా సీఐలపై ఫిర్యాదు

ఏసీబీ అధికారులపైనే అవినీతి ఆరోపణలు.. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ సహా సీఐలపై ఫిర్యాదు

అవినీతి నిర్మూలన చేయాల్సిన ఏసీబీ అధికారులపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు ఒక కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేశారని.. అడ్వాన్స్ కూడా తీసుకున్నారని వచ్చిన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ (TGSPDCL), ఇబ్రహీంబాగ్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్) అంబేడ్కర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 

అవినీతి ఆరోపణల కేసు విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు డబ్బులు డిమాండ్ చేశారని ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు అంబేడ్కర్. మొత్తం ఫోన్ సంభాషణలతో పాటు నేరుగా పిలిపించి మాట్లాడిన విషయాలను రికార్డ్ చేసి డీజీకి అందజేసినట్లు తెలుస్తోంది. 

ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు: 

తన ఆస్తుల విషయంలో అన్ని లెక్కలు ఉన్నప్పటికీ అక్రమాస్తులంటూ నివేదిక ఇచ్చారని డీజీకీ ఫిర్యాదు చేశారు అంబేద్కర్. కేసును నీరుగార్చేందుకు ముప్పై లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఐదు లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా డబ్బుల కోసం ఒత్తిడి చేశారని చెప్పారు. 

ఆరోపణలపై విచారణ జరిపిస్తాం: ఏసీబీ

 మాజీ విద్యుత్ ఏడిఈ అంబేద్కర్ ఆరోపణలపై ఏసీబీ  స్పందించింది. ఏసీబీలో అవినీతికి జీరో టాలరెన్స్‌ అని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న తెలంగాణ ఏసీబీ పేర్కొంది. ఏసీబీ అధికారిపైన వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తామ పేర్కొంది. 

ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా శాఖాపరమైన విచారణ జరుపుతామని ఏసీబీ ఉన్నతాధికారులు  తెలిపారు. ఫిర్యాదుదారుడిని ఇప్పటికే మూడుసార్లు పిలిచినా..   ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని చెబుతున్నారు. ఆరోపణలు నిరూపితమైతే ఏసీబీ అధికారిపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొంత శాఖ అధికారులైనా ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.