Siddharth Galla: కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేసిన మహేష్ బాబు మేనల్లుడు..

Siddharth Galla: కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేసిన మహేష్ బాబు మేనల్లుడు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 13న ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, తాజాగా (నవంబర్ 25, 2026న) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వియత్నాంలోని ఫూ క్వోక్ ద్వీపంలో సముద్రపు అలల సవ్వడి, ప్రకృతి అందాల నడుమ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. నూతన వధూవరులకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎవరీ హైయిన్ కిమ్.. ఎలా మొదలైంది ప్రేమకథ?

సిద్ధార్థ్ గల్లా పెళ్లి చేసుకున్న హైయిన్ కిమ్ దక్షిణ కొరియాకు చెందిన యువతి. జిన్నీ పేరుతోనూ సోషల్ మీడియాలో పరిచయమైన ఆమెకు, సిద్ధార్థ్‌తో కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉన్నట్లు టాక్. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ట్రావెలింగ్‌పై ఆసక్తి ఉన్న హైయిన్ సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు. మరోవైపు సిద్ధార్థ్ కూడా సినీ రంగానికి దూరంగా కుటుంబ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ జంట వివాహ వేడుక గ్రాండ్ గా జరగడంతో పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

సినిమాలకు దూరంగా సిద్ధార్థ్..

గల్లా జయదేవ్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటుండగా, చిన్న కుమారుడు సిద్ధార్థ్ మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంటూ కుటుంబ వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహేష్ బాబు మేనల్లుడు కావడంతో ఆయన వివాహం ఘట్టమనేని అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచింది.

అయితే, పెళ్లికి సంబంధించిన ఫొటోల్లో మహేష్ బాబు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వివాహ వేడుకకు హాజరయ్యారా లేదా అన్నది స్పష్టత లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా షూటింగ్‌తో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. మొత్తానికి సిద్ధార్థ్ గల్లా, హైయిన్ కిమ్ వివాహంతో గల్లా, ఘట్టమనేని కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది.