ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. డ్యూటీలో 46 వేల మంది పోలీసులు.. 3 వేల 191 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. డ్యూటీలో 46 వేల మంది పోలీసులు.. 3 వేల 191 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. మొదటి దశలో భాగంగా.. గురువారం 3 వేల 191 సర్పంచ్, 25 వేల 61 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. గ్రామ పంచాయతీలకు నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 

మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ట్రేస్ యాప్ వంటి టెక్నాలజీని వాడుతున్నారు. 46 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు.

127 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలతో పాటు రైల్వే, ఈగల్ టీమ్స్ను రంగంలోకి దించారు. మద్యం, నగదు పంపిణీ జరగకుండా తనిఖీలు ముమ్మరం చేసినట్లు డీజీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు నవంబర్ 26న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.

శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను 48 గంటల పాటు మూసివేయనున్నారు.

ALSO READ : మందమర్రిలో ఏడు ఎకరాల్లో.. హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్స్

అమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, నెల్లూరు జిల్లాలోని గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూడా గురువారం ఎన్నికలు జరగనున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని 20వ వార్డుకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తున్నారు.