ఢిల్లీలో 87.5 శాతం మహిళలు మెట్రో స్టేషన్లు, బస్సు స్టాపులకు వెళ్లేందుకు భయపడుతున్నట్లు ఒక స్టడీలో తేలింది. సెంటర్ ఫర్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ సంస్థ నిర్వహించిన సర్వేలో మహిళల సేఫ్టీకి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 88.9 శాతం మంది చీకటి పడిన తర్వాత పార్కుల్లో ఉండటం సురక్షితం కాదని చెప్పారు.
'ఎవ్రీడే జర్నీస్: ఉమెన్స్ అండ్ గర్ల్స్ యాక్సెస్ టు ఫుట్‌పాత్స్ అండ్ పబ్లిక్ పార్క్స్ ఇన్ ఢిల్లీ' పేరుతో ఈ అధ్యయనం జరిగింది. 1,588 మంది మహిళలు, బాలికలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. నగరంలో మహిళల కదలికలకు మౌలిక వసతులు, సామాజిక ప్రవర్తన ఎలా అడ్డంకిగా మారుతున్నాయో ఈ నివేదిక విశ్లేషించింది.
మౌలిక వసతుల కొరత..
నగరంలోని ఫుట్‌పాత్‌లపై సరిగ్గా వెలుతురు లేదని 75 శాతం మందికి పైగా తెలిపారు. 60 శాతం మంది ఫుట్‌పాత్‌లు సరిగ్గా లేవని చెప్పారు. పురుషుల ప్రవర్తన, చూపులు, కామెంట్లు చేయడం, వెంబడించడం వల్ల తమ ప్రయాణాలు అన్‌సేఫ్‌గా మారుతున్నాయని 80 శాతం మంది వెల్లడించారు. తమ సమస్యలపై ఏ అధికారికి ఫిర్యాదు చేయాలో 80.5 శాతం మందికి తెలియదని నివేదిక స్పష్టం చేసింది. బాధ్యత గల అధికారులపై అవగాహన లేకపోవడం వల్ల మహిళలు వివక్షకు గురవుతున్నారని సీక్విన్ మేనేజింగ్ డైరెక్టర్ లోరా కె. ప్రభు పేర్కొన్నారు.
నివేదిక సిఫార్సులు..
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పెరుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఆస్థా కుంజ్ పార్కులో జరిగిన సామూహిక అత్యాచారంతో సహా సెప్టెంబర్ నెల మొదటి 3 వారాల్లోనే 13 ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితులపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న స్పందించి, భద్రతను పెంచాలని అధికారులను ఆదేశించింది. దీనికి అనుగుణంగా సీక్విన్ సంస్థ తన సిఫార్సులను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ALSO READ : యుద్ధాల్లో AI జోక్యం వద్దు.. మానవ విచక్షణే కీలకం
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2024లో ఢిల్లీలో మహిళలపై 13వేల396 నేరాలు నమోదయ్యాయి. దేశంలోని 19 మెట్రో నగరాల్లో ఇదే అత్యధికమని నివేదిక పేర్కొంది. భద్రతా భయాల వల్ల మహిళల పనితీరు, ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతోందని సంస్థ వెల్లడించింది. 2023-24లో ఢిల్లీలో పురుషుల పని భాగస్వామ్యం 54 శాతం ఉండగా.. మహిళల భాగస్వామ్యం 14.5 శాతమే ఉందని తెలిపింది.
