సాధారణంగా పార్లమెంటు సమావేశాలు అంటే రాజకీయ చర్చలు, వాదోపవాదాలు, కీలక నిర్ణయాలు గుర్తొస్తాయి. కానీ ఆస్ట్రేలియా పార్లమెంటులో మాత్రం ఓ సంఘటన అందరిని ఆకర్షించింది. ఓ మహిళా సెనేటర్ తన ఆరు నెలల పాపని ఎత్తుకుని పార్లమెంటులో ప్రసంగించారు. అంతేకాదు, ఆమె ప్రసంగిస్తున్న సమయంలో మరో మహిళా సెనేటర్ ఆ చిన్నారిని ఆడిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియాలోని పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రానికి చెందిన ఇండిపెండెంట్ సెనేటర్ ఫాతిమా పేమాన్ నవంబర్ 25, 2026న జరిగిన సెనేట్ సమావేశానికి తన ఆరు నెలల పాపని అలియాను తీసుకొచ్చారు. సభలో ప్రసంగించే సమయంలో కూడా పాపని తన భుజాన ఎత్తుకొని ఉన్నారు. ఒక చేత్తో పాపని జాగ్రత్తగా పట్టుకుంటూ, మరోవైపు తన పార్లమెంటరీ విధులను కొనసాగించారు.
సభలోని డిస్పాచ్ బాక్స్ దగ్గర నిలబడి తోటి సభ్యులతో మాట్లాడటం, తన అభిప్రాయాలను చెప్పడం, వివిధ అంశాలపై ప్రతిపాదనలు చేయడం వంటివి చేశారు. అయితే ఇదంతా తన పాపని దగ్గరే ఉంచుకుని చేయడం అక్కడి వారిని ఆకట్టుకుంది.
చిన్నారితో మరో సెనేటర్ ఆటలు.. వీడియో వైరల్!
ఈ సంఘటనలో మరో విషయం కూడా చోటుచేసుకుంది. ఫాతిమా పేమాన్ వెనుక కూర్చున్న మరో స్వతంత్ర సెనేటర్ లిడియా థోర్ప్.. చిన్నారి అలియాతో సరదాగా గడిపారు. ఆ పాపతో దాగుడుమూతలు ఆడుతూ నవ్విస్తూ కనిపించారు.
దీంతో పార్లమెంటు సమావేశాల మధ్య కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. రాజకీయ చర్చలతో ఎప్పుడూ బిజీగా ఉండే సభలో ఓ చిన్నారి సందడి అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పార్లమెంటులో 6 నెలల చిన్నారితో విధులు.. ప్రత్యేక గుర్తింపు
ఫాతిమా పేమాన్‌కు మాతృత్వం, రాజకీయ బాధ్యతలు రెండూ ముఖ్యమే. ఆస్ట్రేలియా పార్లమెంటులో పనిచేస్తున్న సమయంలో బిడ్డకు జన్మనిచ్చిన పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన తొలి సెనేటర్‌గా ఆమె గుర్తింపు పొందారు.
గతంలోనూ తన కూతురును సెనేట్ ఛాంబర్‌కు తీసుకొచ్చిన ఆమె, తల్లిగా తన అనుభవాలను పంచుకున్నారు. ప్రసవం తర్వాత మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు, తిరిగి ఉద్యోగంలో చేరేటప్పుడు ఎదురయ్యే సవాళ్లు, పిల్లల సంరక్షణతో పాటు ఉద్యోగ బాధ్యతలను ఎలా నిర్వహించాలనే విషయాలపై మాట్లాడారు.
పార్లమెంటులోకి చిన్నారులను తీసుకురావడానికి అనుమతి
ఆస్ట్రేలియా పార్లమెంటులో చిన్నారులను సభకు తీసుకురావడానికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం ఎంపీలు, సెనేటర్లు తమ చిన్నారులను కొంతసేపు సభలో ఉంచుకోవచ్చు. అవసరమైతే తల్లిపాలు కూడా పట్టించవచ్చు.
దీంతో చిన్న పిల్లలు ఉన్న తల్లులు తమ బిడ్డలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేకుండానే పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ALSO READ : ఢిల్లీలో మెట్రో స్టేషన్లు, బస్టాపులకు వెళ్లాలంటే వణుకుతున్న మహిళలు..
మొత్తానికి, ఫాతిమా పేమాన్ తన పాపని ఎత్తుకుని పార్లమెంటులో విధులు నిర్వర్తించిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఉద్యోగ బాధ్యతలు, మాతృత్వం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె వీడియో నెటిజన్ల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
Australian Senator Fatima Payman became the first senator representing Western Australia to give birth while serving in Parliament in 2026, and she has drawn widespread attention for bringing her infant daughter into the Senate chamber . https://t.co/fG4LAsEN9Z
— Shakeel Yasar Ullah (@yasarullah) November 25, 2026
