హైదరాబాద్ సిటీలో ఒకటే హడావిడి.. ఏపీ జనం అంతా సొంతూళ్ల బాట పట్టారు. సంక్రాంతి పండక్కి వెళ్లినట్లు వెళుతున్నారు. దీనికి కారణం సర్పంచ్, వార్డు ఎన్నికలు. 2026, నవంబర్ 26వ తేదీన ఏపీలో మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఏకగ్రీవం అయినా.. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం.. అసెంబ్లీ ఎన్నికలకు మించి హోరాహోరీ నడుస్తుంది. గ్రామాల్లో సహజంగా ఉండే ఆధిపత్యం క్రమంలో... ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే వారం రోజులుగా హైదరాబాద్‌లో ఉంటే ఏపీ జనానికి ఒకటే ఫోన్లు..
వార్డు, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఒకటే ఫోన్లు.. వచ్చి ఓటేసి వెళ్లు అని.. దీనికి తోడు వార్డు, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు తమ వీధి వాళ్లు కావటం.. కులం, మతం, ప్రాంతం, బంధుత్వం ఇలా ఏదో ఒక రకమైన సంబంధం ముడిపడి ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ నుంచి లక్షల మంది ఏపీ ఓటర్లు సొంతూళ్లకు వెళుతున్నారు. ఏపీకి వెళ్లే అన్నీ బస్సులు ఫుల్. నో టికెట్ అంటున్నారు. APSRTC, ఏపీకి వెళ్లే తెలంగాణ ఆర్టీసీలోనూ టికెట్లు అన్నీ ఫుల్ అయ్యాయి. మొదటి విడతలోనే ఇలా ఉంటే.. రెండో విడత జరిగే నవంబర్ 29వ తేదీ.. మూడో విడత జరిగే డిసెంబర్ 2వ తేదీ ఓటింగ్‌కు ఇంకెంత హడావిడి నడుస్తుందో..
ఆర్టీసీ బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు పెంచేశాయి. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు లేవని.. ఫోన్ చేసిన వాళ్లకు చెబితే.. ఐదుగురికి మించి ఉంటే సెవెన్ సీటర్ కారు, జీపులు అరేంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ, అద్దంకి, బెంగళూరు జాతీయ రహదారులపై రద్దీ పెరిగింది. కొంత మంది సొంత కార్లలో ఏపీకి తరలివెళుతుండటంతో.. జాతీయ రహదారులు రద్దీగా మారాయి.
కొందరు సర్పంచ్ అభ్యర్థులైతే ఖర్చులో ఖర్చు అని హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వచ్చే వాళ్లకు కార్లు, బస్సులు అరేంజ్ చేసి మరీ సొంతూళ్లకు వాళ్లను రప్పించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనిపించే ఈ హడావుడి సర్పంచ్ ఎన్నికలకు కనిపిస్తుండటం చూసి ఏపీ గ్రామాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు పోటీగా కూటమి బలపరిచిన అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ALSO READ : ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. డ్యూటీలో 46 వేల మంది పోలీసులు..
ఏపీలో మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 2 కోట్ల 61 లక్షల 52 వేల 377 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 13 వేల 167 సర్పంచ్ స్థానాలకు, లక్షా 32 వేల 514 వార్డులకు ఏపీలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లక్షా 34 వేల 847 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి.
మొదటి దశ:
నవంబర్ 26, 2026
సర్పంచ్ పదవులు: 3,967
వార్డు సభ్యుల పదవులు: 40,012
రెండవ దశ:
నవంబర్ 29, 2026
సర్పంచ్ పదవులు: 4,960
వార్డు సభ్యుల పదవులు: 49,224
మూడవ దశ:
డిసెంబర్ 2, 2026
సర్పంచ్ పదవులు: 4,240
వార్డు సభ్యుల పదవులు: 42,626
