భార్యాభర్త, ఇద్దరు చిన్న పిల్లలు చక్కటి కుటుంబం. ఇద్దరు చిన్నపిల్లల కేరింతలతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండాల్సిన ఫ్యామిలీకి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ.. భర్త అనారోగ్యం పాలవ్వడంతో ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితికి వెళ్లిపోయారు. మూడు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటిని ఖాళీ చేయించాడు యజమాని. దీంతో బస్టాప్ నే నివాసంగా చేసుకొని ఉంటోంది ఆ కుటుంబం. రెండు రోజులుగా చిన్నపిల్లలకు తిండి కూడా లేని సిటీలో ఉన్న ఆ అభాగ్యులను ఆదుకున్నారు పోలీస్ అధికారులు. ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది ఈ హృదయాలను కలిచివేసే ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
విశాఖ హనుమంతువాకకు చెందిన ఓ కుటుంబం దీనస్థితి హృదయాలను కలచివేస్తోంది. భర్త అనారోగ్యంతో మూడు నెలలుగా అద్దె చెల్లించలేకపోవడంతో ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయించారని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
ఎంత వేడుకున్నా కనికరించలేదని, ఇద్దరు చిన్న ఆడపిల్లలతో రెండు రోజులుగా వీఎంఆర్డీఏ పార్క్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో తలదాచుకుంటున్నామని వాపోయారు. ఒకరోజు పిల్లలతో సహా తాము కూడా భోజనం కూడా చేయలేదని అంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణ్ మూర్తి స్పందించారు. కుటుంబాన్ని బస్టాప్ నుంచి రక్షించి జీవీఎంసీ రెడ్ క్రాస్ షెల్టర్ హోమ్‌కు తరలించారు.
