తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్ క్షమాపణ..

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్ క్షమాపణ..

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతోంది. నవంబర్ 24న దీపారాధన చేయనందుకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం ( నవంబర్ 25 ) క్షమాపణలు చెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మదురై జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ ఈ మేరకు కోర్టుకు స్టేటస్ రిపోర్టును సమర్పించారు. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన బెంచ్‌కు ఈ వివరాలు అందించారు. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దీపారాధన కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా యంత్రాంగం రిపోర్టులో పేర్కొంది. దీపతూన్ దగ్గర దీపం వెలిగించడానికి ఆలయ యంత్రాంగం ఆమోదించిన టీమ్‌ను పంపేందుకు సిద్ధమయ్యామని తెలిపింది.

అయితే ఆలయ ధర్మకర్తల మండలి నుంచి అనుమతి రాకపోవడం వల్లే ఈ ప్రక్రియ నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. కోర్టు సూచించిన టీమ్‌కు బోర్డు ఆమోదం తెలపలేదని చెప్పింది. దానికి బదులుగా సంప్రదాయ పద్ధతిలోనే కార్తీక దీపం వెలిగించాలని బోర్డు తీర్మానం చేసినట్లు రిపోర్టులో వెల్లడించింది. దీనివల్ల కొండపై ఉన్న రాతి స్తంభంపై కాకుండా ఉచ్చిపిల్లయార్ మండపం దగ్గర మాత్రమే మంగళవారం దీపాన్ని వెలిగించారు.

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని కలెక్టర్ నిషాంత్ కృష్ణ తన నివేదికలో పేర్కొన్నారు. దీపారాధన జరగనందుకు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, భవిష్యత్తులో కోర్టు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని పాటిస్తామని వివరించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లతో అదనపు స్టేటస్ రిపోర్టును సమర్పిస్తానని చెప్పారు.

దీపతూన్ అనేది మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఒక రాతి స్తంభం. ఇక్కడ దీపం వెలిగించడానికి మద్రాసు హైకోర్టు ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ కేసులో తుది విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. అలాగే ఈ వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లను కూడా బెంచ్ విచారించనుంది.