అంబానీ కంపెనీలో రెండోసారి లేఆఫ్స్.. ఎంత మందిని పీకేస్తున్నారంటే..?

అంబానీ కంపెనీలో రెండోసారి లేఆఫ్స్.. ఎంత మందిని పీకేస్తున్నారంటే..?

దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన ముఖేష్ అంబానీ కంపెనీ జియోస్టార్‌లో మరోసారి లేఆఫ్స్ కలకలం మొదలైంది. డిస్నీ స్టార్, వయాకామ్18 విలీనం తర్వాత ఏర్పడిన ఈ సంస్థ.. ఇప్పుడు తన టీవీ బిజినెస్‌లో ఖర్చులు తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే పనిలో పడింది.

ప్రస్తుతం జనం అంతా ఫోన్లు, ఓటీటీల వైపు మళ్లడంతో సాధారణ టీవీ ఛానెళ్లకు ఆదరణ తగ్గిపోతోంది. కేబుల్, డీటీహెచ్ కనెక్షన్లు తగ్గిపోవడం, యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో టీవీ ఛానెళ్లను నడపడం కంపెనీకి భారంగా మారింది. ప్రస్తుతం జియోస్టార్ కింద సుమారు 120 ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ ఛానెళ్లు ఉన్నాయి. వీటిలో సరైన ఆదాయం రాకుండా కేవలం ఖర్చులను పెంచుతున్న ఛానెళ్లను మూసేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఒకవైపు టీవీ ఛానెళ్లు నష్టాల్లో ఉంటే.. మరోవైపు ఇదే కంపెనీకి చెందిన 'జియోహాట్‌స్టార్' యాప్ మాత్రం యాడ్స్, సబ్‌స్క్రిప్షన్లతో దూసుకుపోతోంది. అందుకే నష్టాల్లో ఉన్న టీవీ ఛానెళ్లను తగ్గించుకుని, ఆ డబ్బును బాగా గ్రోత్ ఉన్న డిజిటల్ బిజినెస్‌లో పెట్టాలని మేనేజ్‌మెంట్ డిసైడ్ అయింది.

డిస్నీ, వయాకామ్ విలీనం తర్వాత ఈ కంపెనీలో ఉద్యోగాలు తీసేయడం ఇది రెండోసారి. గత ఏడాది మొదటి రౌండ్‌లో సుమారు 500 మందిని తొలగించారు. ఇప్పుడు కంపెనీలో ఉన్న 5 వేల మందికి పైగా స్టాఫ్‌లో సుమారు 10 శాతం మందిపై ఈ లేఆఫ్స్ ఎఫెక్ట్ పడొచ్చని తెలుస్తోంది. అయితే ఉద్యోగం కోల్పోతున్న వారికి కంపెనీ కనీసం 6 నెలల జీతంతో పాటు.. ఈ ఏడాదికి రావాల్సిన బోనస్‌ను కూడా సెటిల్‌మెంట్ కింద ఇస్తోంది.

నిజానికి ఈ కష్టాలు కేవలం అంబానీ కంపెనీకి మాత్రమే రాలేదు. మారుతున్న ట్రెండ్ వల్ల జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ వంటి ఇతర పెద్ద టీవీ నెట్‌వర్క్‌లు కూడా రీసెంట్‌గా తమ స్టాఫ్‌ను బాగా తగ్గించుకున్నాయి. మారుతున్న మార్కెట్‌కు తగ్గట్టుగా లాభాలు వచ్చే బిజినెస్‌లపైనే ఫోకస్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జియోస్టార్ ప్రతినిధి చెబుతున్నారు.