రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం 'రామాయణ' ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం.. మరోవైపు ఆస్కార్ బరిలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ విజువల్ వండర్ 99వ అకాడమీ అవార్డుల విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విభాగంలో టాప్-20 జాబితాలో చోటు సంపాదించినట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ దిగ్గజాలతో ఢీ..
'రామాయణ'కు ఈ గుర్తింపు రావడం భారతీయ సినిమాకు గర్వకారణమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ', 'డ్యూన్: పార్ట్ త్రీ', 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే', 'సూపర్‌గర్ల్', 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' వంటి భారీ చిత్రాలతో 'రామాయణ' సినిమా పోటీ పడుతోంది. టాప్-20 నుంచి తదుపరి దశలో పది చిత్రాలను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. అయితే టాప్-20లో చోటు దక్కడం నామినేషన్ ఖరారైనట్లు కాదు. తుది నామినేషన్లకు చేరితే భారతీయ సాంకేతిక ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుంది.
బాక్సాఫీస్ వద్ద వసూళ్లవేట..
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1735 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో భారత్ నుంచి రూ. 1162.15 కోట్లు, ఓవర్సిస్ నుంచి రూ. 573 కోట్లకు పైగా వచ్చాయి. మూడో మంగళవారం ఒక్కరోజే దేశీయంగా రూ.17.50 కోట్ల నెట్, విదేశాల్లో రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. మంగళవారం టికెట్ ధరలను రూ.99కు తగ్గించడం కూడా వసూళ్ల పెరుగుదలకు దోహదపడిందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి..
రూ.2 వేల కోట్ల వైపు..
ప్రస్తుతం 'పుష్ప-2' ప్రపంచవ్యాప్త వసూళ్లకు చేరువలో ఉన్న 'రామాయణ'.. త్వరలోనే మరో రికార్డును తిరగరాయాలని చూస్తోంది. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సన్నీ డియోల్, రవిదూబే, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. రెండో భాగాన్ని 2028 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకోవడంతోపాటు ఆస్కార్ నామినేషన్‌నూ ఈ రామబాణం సాధిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది....
