చమురు కంపెనీలను ఇథనాల్ కలపని పెట్రోల్ శాంపిల్స్ ఇవ్వమనండి: కేంద్రానికి కేరళ ప్రభుత్వ విజ్ఞప్తి

చమురు కంపెనీలను ఇథనాల్ కలపని పెట్రోల్ శాంపిల్స్ ఇవ్వమనండి: కేంద్రానికి కేరళ ప్రభుత్వ విజ్ఞప్తి

ఈ20 పెట్రోల్ విషయంలో కేరళలో గత కొన్ని రోజులుగా వివాదం చెలరేగుతోంది. పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్  ఎక్కువ మోతాదులో ఉందని వస్తున్న ఆరోపణలపై విచారణకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు ఇథనాల్ లేని పెట్రోల్ నమూనాలు ఇవ్వాలని.. రెండింటిని పరీక్షించేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. అయితే ఇథనాల్ లేని పెట్రోల్ నమూనాలు ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరిస్తుండటంతో ప్రభుత్వం కేంద్రం సాయం కోరింది. 

కేరళలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం స్థాయిపై ఇటీవల వివాదం తీవ్రమైంది. ఈ20 పెట్రోల్ పేరిట నిర్దేశించిన మోతాదు కంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్నారని గత పరిశీలనల్లో తేలిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. అయితే ఆయిల్ కంపెనీలు సహకరించకపోవడంతో కేరళ ప్రభుత్వం కేంద్రం సహాయం కోరింది.

కేరళ ఆహార, పౌర సరఫరాల మంత్రి అనూప్ జాకబ్ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర మంత్రి సురేష్ గోపికి లేఖలు రాశారు. ఇథనాల్ లేని స్వచ్ఛమైన పెట్రోల్ నమూనాలు ఇవ్వడానికి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి కంపెనీలు నిరాకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రారంభంలో సుముఖత తెలిపినా తర్వాత నమూనాలు అందించడం లేదని, అధికారులు పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. కాబట్టి కేంద్రం జోక్యం చేసుకుని కంపెనీలను నమూనాలు అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

వాహనాల ఇంజిన్‌లపై ఇథనాల్ ప్రభావం ఉంటుందని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంపుల నుంచి నమూనాలు సేకరించి ప్రభుత్వ కెమికల్ ల్యాబ్‌కు పంపారు. ఇథనాల్ పరిమాణాన్ని సరిగ్గా నిర్ధారించాలంటే స్వచ్ఛమైన (ఎథనాల్ లేని) పెట్రోల్ నమూనాలు కూడా అవసరమని ల్యాబ్ స్పష్టం చేసింది. వాటితో పోల్చి చూడాలని సూచించింది.

ALSO READ : తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్ క్షమాపణ..

ప్రభుత్వ లక్ష్యం ఏ కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీయడం కాదని, కేవలం ఇథనాల్ పరిమాణం నిర్దేశిత పరిమితుల్లో ఉందో లేదో తెలుసుకోవడమేనని మంత్రి అనూప్ జాకబ్ స్పష్టం చేశారు. పరిశీలనలో అధిక మోతాదు కనిపిస్తే సంబంధిత కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించారు. ఈ వివాదంపై  కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.