కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై రాహుల్ గాంధీపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నవంబర్ 25, బుధవారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరిగి పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించవచ్చా లేదా అనే అంశాన్ని కూడా మరోసారి పరిశీలించాలని స్పష్టం చేసింది.
సీబీఐ, ఈడీ విచారణకు హైకోర్టు ఆదేశాలు
రాహుల్ గాంధీకి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. ఈ ఆరోపణలకు సంబంధించి సీబీఐ, ఈడీలు పరిశీలన జరపాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో గతంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవద్దని సీబీఐ, ఈడీలకు సూచించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించవద్దని ఆదేశించింది.
సీబీఐ అఫిడవిట్‌పై హైకోర్టు అసంతృప్తి
మరోవైపు, సీబీఐ సమర్పించిన అఫిడవిట్‌పై అలహాబాద్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ రిపోర్ట్ లేదని పేర్కొంది. రాహుల్ గాంధీ ఆస్తులకు సంబంధించి పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారనే వివరాలు అఫిడవిట్‌లో పూర్తిగా లేవని అభిప్రాయపడింది.
దీంతో న్యూఢిల్లీలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సంబంధిత జాయింట్ డైరెక్టర్ లేదా విభాగాధిపతి స్వయంగా కొత్త అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
గతంలోనూ రాహుల్‌పై పిటిషన్లు
ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందంటూ బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ గతంలోనూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. తాజా కేసులో మాత్రం సీబీఐ, ఈడీ విచారణకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్‌ను తిరిగి పరిశీలించాలని హైకోర్టుకు పంపింది.
