సినిమాల్లో చిన్న చిన్న పొరపాట్లే కొన్నిసార్లు పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. అలాగే ఇప్పుడు మలయాళ స్టార్ హీరో కుంచాకో బోబన్ నటించిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' చిత్రానికి అలాంటి పరిస్థితే ఎదురైంది. సినిమాలో ఓ సీన్‌లో చూపించిన మొబైల్ నంబర్.. నిజ జీవితంలో ఓ వ్యక్తికి చెందినదిగా తేలడంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. దీంతో ఈ సినిమా నిర్మాతలు, ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి.
సినిమాలో నంబర్.. నిజ జీవితంలో వేధింపులు!
2025 ఫిబ్రవరిలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమాలో ఓ కీలక సన్నివేశంలో మహిళా డాక్టర్ పాత్రకు సంబంధించిన ఫోన్ నంబర్‌ను చూపించారు. అయితే అది కల్పిత నంబర్ కాదు.. ఎర్నాకుళానికి చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్ ప్రకాశ్ ఉపయోగిస్తున్న వ్యక్తిగత మొబైల్ నంబర్. ఈ నంబర్ 2014 నుంచి ఆయన వినియోగంలో ఉంది. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, మార్చిలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావడంతో సమస్య మరింత తీవ్రమైందని ఆయన ఆరోపించారు.
సినిమాలోని పాత్రకు సంబంధించిన నంబర్‌గా భావించిన పలువురు అపరిచితులు ఆయనకు ఫోన్లు, మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టారట. భారత్‌తో పాటు విదేశాల నుంచి కూడా కాల్స్ వచ్చాయని.. కొందరు అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా లైంగికపరమైన అసభ్య సందేశాలు తనను తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు కీలక ఆదేశాలు..
ఈ వ్యవహారంపై అక్షయ్ ప్రకాశ్ ఎర్నాకుళం సైబర్ సెల్‌ను ఆశ్రయించడంతోపాటు చిత్రబృందాన్ని కూడా సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నవంబర్ 21న చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ షమ్నాద్ ఎస్.. BNSS సెక్షన్ 175(3) కింద ఫిర్యాదును పోలీసులకు పంపించి, క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. పోలీసుల నివేదిక ప్రకారం సినిమాలో సదరు నంబర్ రెండుసార్లు కనిపించినట్లు గుర్తించారు.
ఎవరెవరిపై ఫిర్యాదు చేశారంటే?
నిర్మాత మార్టిన్ ప్రకాట్, సహ నిర్మాతలు సిబి చావర, రంజిత్ నాయర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, నెట్‌ఫ్లిక్స్ తదితరులను ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత నంబర్‌ను సినిమాలో ఉపయోగించారని, దాని బదులు కల్పిత నంబర్ చూపించాల్సిందని ఆయన వాదిస్తున్నారు. జీతు అష్రఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కుంచాకో బోబన్ పోలీస్ అధికారిగా నటించగా, ప్రియమణి, జగదీష్, విషాక్ నాయర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ వివాదంపై పోలీసుల దర్యాప్తు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. ఒక చిన్న ఫోన్ నంబర్ తప్పిదంవల్ల.. సినిమా యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది..
