‘ది బిగ్ బిలియన్ డేస్’ సక్సెస్ వెనుక ఉన్న వ్యక్తి.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

‘ది బిగ్ బిలియన్ డేస్’ సక్సెస్ వెనుక ఉన్న వ్యక్తి.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నవంబర్ 25న సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆయన స్థానంలో కొత్త సీఈఓను వచ్చే కొన్ని వారాల్లో వెల్లడిస్తామని తెలిపింది.

ప్రస్తుతానికి చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ త్యాగరాజన్, బోర్డు సభ్యులు కలిసి సంస్థను నడిపిస్తారని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. కళ్యాణ్ కృష్ణమూర్తి 11 ఏళ్లకు పైగా ఈ ఈకామర్స్ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం 5 రెట్లు పెరిగింది. కళ్యాణ్ కృష్ణమూర్తి 2013లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. 2017 జనవరిలో సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ను దక్కించుకున్న తర్వాత 2018లో ఆయన గ్రూప్ సీఈఓ అయ్యారు.

ఆయన పదవీ కాలంలో ఫ్లిప్‌కార్ట్ తన ఈకామర్స్ కార్యకలాపాలను విస్తరించింది. ఫ్యాషన్, ట్రావెల్, ఫిన్‌టెక్ విభాగాల్లో పట్టు సాధించింది. ‘ది బిగ్ బిలియన్ డేస్’ పేరుతో నిర్వహించే వార్షిక సేల్ దేశంలోనే పెద్ద ఆన్‌లైన్ షాపింగ్ ఈవెంట్‌గా ఎదిగింది. ఫ్లిప్‌కార్ట్ ప్రయాణంలో భాగం కావడం గర్వంగా ఉందని కళ్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. నీతి, నిజాయితీ, పాలనా ప్రమాణాలే సంస్థ ఎదుగుదలకు కారణమని పేర్కొన్నారు. వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ నికోలస్ స్పందిస్తూ.. కళ్యాణ్ నాయకత్వం వల్ల ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ రెండు సంస్థలకు మేలు జరిగిందని చెప్పారు. ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లాభాల బాటలోకి వచ్చేందుకు.. పబ్లిక్ లిస్టింగ్ కోసం సిద్ధమవుతోంది. అమెజాన్, మీషో వంటి సంస్థల నుంచి పోటీ ఎదురవుతున్న తరుణంలో క్విక్ కామర్స్ విభాగంలోకి ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ను ప్రవేశపెట్టింది. వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు, భారత్‌లోని అవకాశాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. 2007లో మొదలైన ఫ్లిప్‌కార్ట్‌కు ప్రస్తుతం 50 కోట్ల కంటే ఎక్కువ మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. 14 లక్షల మంది సెల్లర్లు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారం చేస్తున్నారు. మింత్ర, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, క్లియర్‌ట్రిప్, సూపర్ మనీ వంటి సంస్థలు ఈ గ్రూప్ పరిధిలోకి వస్తాయి.