అత్తా, కోడలంటే సమాజంలో ఉండే అభిప్రాయం ఏంటో తెలిసిందే. అత్తాకోడళ్లను పాముముంగిసల్లా చూస్తారు. చాలా మంది అత్తాకోడళ్లు ఇప్పటికీ అలానే ఉన్నారు. కానీ.. అత్తను కూడా కన్న తల్లిలా చూసుకోవడమే కాకుండా, ఆమెకు చివరి రోజుల్లో సేవలు చేసి, ఆమె చనిపోతే తలకొరివి పెట్టిన కోడలు ఈరోజుల్లో ఉండటం నిజంగా గొప్ప విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. కోడలి మంచితనాన్ని మెచ్చుకున్నారు.
జన్నారం గ్రామానికి చెందిన గోంగూర సావిత్రమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్య కారణాలతో చనిపోయింది. ఆమె భర్త, ఒక్కగానొక్క కొడుకు ఇద్దరూ చనిపోయారు. మనవడి భార్య గర్భం దాల్చడంతో మనవడు తలకొరివి పెట్టలేని పరిస్థితి. ఈ క్రమంలో.. వృద్ధాప్యంలో మంచాన పడిన అత్తకు సేవలు చేసిన కోడలు కౌసల్య తన భర్త స్థానంలో సావిత్రమ్మ అంత్యక్రియలు నిర్వహించింది. -అత్తకు అంత్యక్రియలు చేసి తలకొరివి పెట్టిన కౌసల్యను గ్రామస్తులు, సన్నిహితులు మెచ్చుకున్నారు.
అత్తాకోడళ్ల బంధం అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది గొడవలు, అపార్థాలు, మనస్పర్థలు. అయితే ప్రతి బంధంలోనూ గొడవలే ఉండవు.. ప్రేమ, ఆప్యాయత, అనురాగం కూడా ఉంటాయని నిరూపించింది ఈ కోడలు. అత్తను కన్నతల్లిలా చూసుకోవడమే కాకుండా, ఆమె చివరి రోజుల్లో దగ్గరుండి సేవలు చేసి, చివరికి తన భర్త స్థానంలో అంత్యక్రియలు నిర్వహించి తలకొరివి పెట్టింది. ఈ ఘటన అందరి హృదయాలను కదిలించింది.
నిజానికి బంధాలు రక్త సంబంధం కారణంగానే ఏర్పడవు. ప్రేమతోనూ ఏర్పడతాయి. మనిషి బతికున్నప్పుడు చూపించే సేవ, ఆప్యాయతే నిజమైన బంధానికి నిదర్శనం. కౌసల్య చేసిన పని సమాజానికి ఒక మంచి సందేశం. ఇలాంటి మానవీయ ఘటనలు మనుషుల మధ్య ప్రేమానురాగాల విలువను మరోసారి గుర్తుచేశాయి.
