దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఇప్పటి వరకు ఎన్నో నివేదికలు వచ్చాయి. ఢిల్లీలో బతికే పరిస్థితి లేదని.. వాయు కాలుష్యంలో ప్రపంచంలోనే టాప్ 10 సిటీల జాబితాలో చేరిపోయినట్లు రిపోర్టులు వెల్లడించాయి. అయితే రాజధానిలో ప్రతి మూడు రోజులకు ఒక ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణం నమోదవుతోందని వచ్చిన ఈ రిపోర్టు రాజధాని ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది.
ఢిల్లీలోని ఎయిమ్స్ సహా ఆరు ప్రధాన ఆసుపత్రుల్లో 2020 నుంచి 2026 జులై వరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చనిపోయిన వివరాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఆరేళ్లలో 6 వేల 500 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదైనట్లు తేలింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పీటీఐ వార్తా సంస్థ సేకరించిన వివరాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ ఆసుపత్రుల్లో ప్రతి మూడు రోజులకు ఒకరు లంగ్ క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నట్లు వెల్లడయింది.
అయితే ఈ గణాంకాలు పొగతాగే వారికి సంబంధించినవి అనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు చెప్తున్నారు. వాయు కాలుష్యం కారణంగా ధూమపానం చేయని వారు, మహిళలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు పొగాకు వాడకం ప్రధాన కారణమైనా, ప్రస్తుతం యువత, నాన్ స్మోకర్లలో కూడా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలోని పీఎం 2.5 కణాలు ఊపిరితిత్తుల్లోకి లోతుగా వెళ్లి కణజాలాన్ని దెబ్బతీస్తాయని ముంబై హెచ్‌సీజీ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యురాలు ఇందూ అంబుల్కర్ తెలిపారు. దీర్ఘకాలం పాటు కాలుష్యానికి గురికావడం వల్ల కణాల నష్టం జరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
గ్లోబోకాన్ 2024 అంచనాల ప్రకారం భారత్‌లో 2024లో లక్షా 12 వేల 659 కొత్త ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. దేశంలో క్యాన్సర్ మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 98 వేల 687 మంది ఈ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ సంస్థ అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ ఇప్పటికే వాయు కాలుష్యాన్ని క్యాన్సర్ కారకంగా గుర్తించింది.
ఆలస్యంగా గుర్తించడంతో సమస్య:
వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. దగ్గు, ఆయాసం, బరువు తగ్గడం వంటి లక్షణాలను చాలా మంది టీబీ లేదా కాలుష్య సంబంధిత సమస్యలుగా భావిస్తున్నారు. చాలా మంది రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే అంటే స్టేజ్ 3 లేదా 4లో ఆసుపత్రులకు వస్తున్నారని ఫోర్టిస్ గురుగ్రామ్ వైద్యుడు నితేష్ రోహత్గీ చెప్పారు. ఆర్టీఐ గణాంకాలు ఒక హెచ్చరిక లాంటివని, ఇతర ఆసుపత్రుల డేటాను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.
అవగాహన పెరగాలి
పొగ అలవాటు లేని మహిళల్లో కూడా ఎడెనోకార్సినోమా వంటి క్యాన్సర్ రకాలు కనిపిస్తున్నాయని అపోలో ఎథీనా ఉమెన్స్ క్యాన్సర్ సెంటర్ ప్రతినిధి గీతా కడయ్యప్రాత్ చెప్పారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు కేవలం పొగాకు నియంత్రణే కాకుండా వాయు కాలుష్యం, పని ప్రదేశాల్లో కాలుష్యం, ఇంటి లోపల ఉండే కాలుష్యం వంటి అంశాలపై కూడా అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న కేసులను అరికట్టేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ విధానం, క్యాన్సర్ రిజిస్ట్రీ అవసరమని వైద్యులు చెప్పారు.
