ఇక టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన పనిలేదు.. FASTag ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే !

ఇక టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన పనిలేదు.. FASTag ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే !

టోల్ ప్లాజాల దగ్గరకు వెళ్లగానే వాహనాలన్నీ క్యూలో ఉండటం మనకు తెలిసిందే. ఫాస్టాగ్ ఉన్నా సరే, ఒక్కోసారి వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల టైం  వృథా కావడమే కాకుండా, ఇంధనం కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్‌లు వాహనదారులకు పెద్ద సమస్యగా మారుతున్నాయి.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) విధానం. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ చార్జీలు కట్టడానికి వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. వాహనం టోల్ ప్లాజా దగ్గరకు వెళ్తుండగానే టోల్ ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఢిల్లీలోని ఘాజీపూర్, బదర్‌పూర్‌తో పాటు ఇతర  మార్గాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోతే ఏం జరుగుతుంది ? వాహనదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? తెలుసుకుందాం....

అసలు MLFF విధానం అంటే ఏమిటి?
MLFF అంటే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (Multi-Lane Free Flow). తెలుగులో చెప్పాలంటే వాహనాలు ఎక్కడా ఆగకుండా టోల్ చెల్లించే విధానం అని అర్థం. ప్రస్తుతం మనం టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లినప్పుడు  టోల్ గేట్ దగ్గర వాహనాలన్నీ క్యూలో ఉంటాయి. అక్కడ ఉన్న స్కానర్ వాహన ఫాస్టాగ్‌ను స్కాన్ చేస్తాయి. ఆ తర్వాత టోల్ చార్జెస్  కట్ అవుతాయి. బ్యారియర్ తెరుచుకున్నాక వాహనం ముందుకు వెళ్తుంది. ఇలా ఒక్కో వాహనం దగ్గర కొంత సమయం పడుతుంది. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటే కిలోమీటర్లకి పైగా ట్రాఫిక్ నిలిచిపోతుంది.

కానీ MLFF విధానంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. టోల్ ప్లాజా దగ్గర వాహనాలను ఆపేందుకు బ్యారియర్లు ఉండవు. రోడ్డుపై ప్రత్యేకంగా కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేస్తారు. వీటిని పెద్ద ఇనుప నిర్మాణాలపై (గ్యాంట్రీలు) అమర్చుతారు. వాహనాలు ఆ గ్యాంట్రీల కింద నుంచి వెళ్లినప్పుడు వాటిని కెమెరాలు, సెన్సార్లు గుర్తిస్తాయి. వాహన ఫాస్టాగ్‌ను గుర్తించి, టోల్ ఫీజును ఆటోమేటిక్‌గా కట్ చేస్తాయి. అంటే వాహనం వేగాన్ని తగ్గించకుండా ఈజీగా టోల్ ప్లాజా నుండి వెళ్లిపోవచ్చు.

MLFF విధానం ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త టోల్ విధానం ముఖ్యంగా రెండు టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తుంది. అవి RFID, ANPR.

RFID టెక్నాలజీ:
RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (Radio Frequency Identification). మన వాహనానికి ముందు అద్దంపై అతికించే ఫాస్టాగ్‌ను గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. వాహనం టోల్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన రీడర్లు రేడియో సిగ్నల్స్ ద్వారా ఫాస్టాగ్‌ను గుర్తిస్తాయి. ఆ తర్వాత వాహనానికి సంబంధించిన టోల్ ఛార్జీని ఫాస్టాగ్ అకౌంట్ నుంచి కట్ చేస్తాయి.

ANPR టెక్నాలజీ:

ANPR అంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (Automatic Number Plate Recognition). అంటే వాహనాల నంబర్ ప్లేట్లను కెమెరాల సాయంతో ఆటోమేటిక్‌గా గుర్తించే విధానం. రోడ్డుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను ఫొటో తీసి, దానిపై ఉన్న అక్షరాలు, నంబర్లను గుర్తిస్తాయి. దీంతో ఫాస్టాగ్ ద్వారా వాహనాన్ని గుర్తించడంతో పాటు, నంబర్ ప్లేట్ వివరాలను కూడా ధృవీకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి పనిచేయడం వల్ల వాహనాన్ని ఆపకుండానే గుర్తించడం, టోల్ చార్జెస్ చెల్లించడం సాధ్యమవుతుంది.

ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోతే ఏం జరుగుతుంది?
 చాలామందికి వచ్చే సందేహం ఇదే. మన వాహన ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోతే ఏం చేస్తారు ? ఫాస్టాగ్ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి ?ఇలాంటి సందర్భాల్లో వాహనాన్ని కెమెరాల ద్వారా నంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తించవచ్చు. ఆ తర్వాత సంబంధిత వాహన యజమానికి ఎలక్ట్రానిక్ నోటీసు (E-Notice) పంపించే అవకాశం ఉంటుంది.

జాతీయ రహదారులపై అమల్లో ఉన్న కొన్ని నిబంధనల ప్రకారం, టోల్ చెల్లించాల్సిన మొత్తాన్ని 72 గంటల్లో చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఆ గడువులోపు డబ్బులు చెల్లించకపోతే సాధారణ టోల్ ఫీజుకు రెండింతలు చెల్లించాల్సి రావచ్చు. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో అమలు చేయనున్న MLFF విధానానికి సంబంధించి చెల్లింపులు, జరిమానాలు, నోటీసుల విషయంలో  అధికారిక నిబంధనలు వెల్లడికావాల్సి ఉంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఇవే  నిబంధనలు ఉంటాయని ఇప్పుడే చెప్పలేం.

ఢిల్లీలో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
ఢిల్లీలోని వివిధ ప్రవేశ మార్గాల్లో MLFF విధానాన్ని అమలు చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 24న వచ్చిన  నివేదికల ప్రకారం, ఘాజీపూర్ టోల్ ప్లాజా దగ్గర ఈ విధానానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మక పరీక్షలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

అయితే ఢిల్లీలోని అన్ని సరిహద్దు మార్గాల్లో ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మిగతా ప్రాంతాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేసి దశలవారీగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఘాజీపూర్, బదర్‌పూర్ వంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే వాహనాలు టోల్ ప్లాజాల దగ్గర ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. MLFF అమలైతే ఈ సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

ఈ కొత్త విధానం వల్ల  ప్రయోజనాలు ఏమిటి?
MLFF విధానం అందుబాటులోకి వస్తే వాహనదారులకు చాలా ఉపయోగాలు ఉంటాయి.
*టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు క్యూలో ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. దీంతో రద్దీ తగ్గుతుంది.
* టోల్ చెల్లింపు కోసం ప్రత్యేకంగా ఆగాల్సిన పని ఉండదు. సమయం ఆదాతో పాటు  జర్నీ  వేగంగా  అవుతుంది.
*టోల్ ప్లాజా దగ్గర వాహనాలను పదేపదే ఆపి, స్టార్ట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గే అవకాశం ఉంది.
* టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా ఉండటం వల్ల పొగ, వాయు కాలుష్యం తగ్గవచ్చు.
*ఫాస్టాగ్ ద్వారా టోల్ చార్జెస్  ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

టోల్ ట్యాక్స్ పూర్తిగా రద్దవుతుందా?
MLFF విధానం గురించి చాలామందికి వచ్చే మరో డౌట్.. ఇకపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదా? అని. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. MLFF విధానం అంటే టోల్ ట్యాక్స్ రద్దు చేయడం కాదు. టోల్ వసూలు చేసే పద్ధతిని మాత్రమే మార్చడం. గతంలో టోల్ ప్లాజా దగ్గర వాహనాన్ని ఆపి డబ్బులు చెల్లించేవారు. ఇప్పుడు వాహనం కదులుతుండగానే ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కట్ అవుతాయి. అంటే టోల్ ఫీజు మాత్రం యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే టోల్ ఛార్జ్ కోసం వాహనాన్ని ఆపాల్సిన అవసరం ఉండదు.

మొత్తానికి.. ఢిల్లీలో MLFF విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే టోల్ ప్లాజాల దగ్గర గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఢిల్లీకి వచ్చి వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా మారవచ్చు. అయితే అన్ని  మార్గాల్లో ఈ విధానం ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది ? చెల్లింపులు, జరిమానాలకు సంబంధించిన నిబంధనలు ఎలా ఉంటాయి? అన్నది అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టమవుతుంది.