భారత ఐటీ రంగంపై AI తీవ్ర ప్రభావం చూపుతోంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బీపీవో), మ్యాన్యువల్ టెస్టింగ్, టెక్నికల్ సపోర్ట్ వంటి విభాగాల్లో లేఆఫ్స్పై ఉద్యోగుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ఏఐ వల్ల ముప్పు పొంచి ఉందని నివేదికలు చెబుతున్నాయి.
రిక్రూట్‌మెంట్ విధానం మారుతోంది. ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఉద్యోగులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో లక్షల మంది ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే రకమైన పనిని పదేపదే చేసే చోట ఏఐ సులభంగా మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తోంది. నియమ నిబంధనల ప్రకారం నడిచే పనులను ఏఐ వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేస్తోంది. మానవ ప్రమేయం లేకుండానే ఈ పనులన్నీ ఏఐ టూల్స్ ద్వారా జరుగుతున్నాయి.
బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బీపీవో), బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) రంగాల్లో సుమారు 16 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ రంగం మొత్తం మీద 60 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. నాస్కామ్ వివరాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 54.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే బీపీవో రంగంలోని ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఏఐ వాయిస్ ఏజెంట్ల వల్ల కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఖాతాల వివరాలు, ఫిర్యాదులు, సర్వీస్ రిక్వెస్ట్‌లను ఏఐ చాట్‌బాట్‌లు సులభంగా హ్యాండిల్ చేస్తున్నాయి.
పేమెంట్లు, బుకింగ్స్ వంటి పనులను కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్ చేస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, టెలిమార్కెటింగ్ ఏజెంట్లు, బ్యాక్ ఆఫీస్ ప్రాసెసర్లు ఏఐ వల్ల సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయితే కస్టమర్లను నిలుపుకోవడం, చర్చలు జరపడం, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వంటి క్లిష్టమైన పనుల్లో ఉన్నవారు మాత్రం సురక్షితంగా ఉండొచ్చు.
సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో టెస్టింగ్, క్వాలిటీ అనాలిసిస్ కోసం సుమారు 3.75 లక్షల నుంచి 4.5 లక్షల మంది పనిచేస్తున్నారు. అప్లికేషన్ల పనితీరును స్వయంగా తనిఖీ చేసే వీరికి ఏఐ వల్ల ముప్పు ఎక్కువగా ఉంది. ఏఐ టూల్స్ ఇప్పుడు టెస్ట్ కేస్‌లను తయారు చేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసినప్పుడు చేసే టెస్టింగ్‌ను కూడా ఏఐ ద్వారా నిర్వహిస్తున్నారు.
బేసిక్ కోడింగ్ చేసే జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ఏఐ ఏజెంట్లు అన్ని రకాల కోడ్‌లను వేగంగా రాస్తున్నాయి. స్క్రిప్టులు రాయడం, ప్రోగ్రామింగ్ లోపాలను గుర్తించడం వంటి పనులను ఏఐ సులభంగా చేస్తోంది. జూనియర్ ప్రోగ్రామర్లు, వెబ్‌సైట్ డెవలపర్ల స్థానంలో ఏఐ టూల్స్ వచ్చే అవకాశం ఉంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం బ్యాంకులు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నాయి. లోన్ డాక్యుమెంట్లు తనిఖీ చేయడం, అకౌంట్స్ సరిచూడడం, ఇన్వాయిస్‌ల తయారీ వంటి పనులకు వీటిని వాడుతున్నాయి. ఐటీ రంగంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కూడా తగ్గుతోంది. 5 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్నవారిపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అప్లికేషన్ మెయింటెనెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వంటి విభాగాల్లో నియామకాలు తగ్గుతున్నట్లు టీమ్‌లీజ్ డిజిటల్ తెలిపింది. అనుభవం ఉన్నప్పటికీ పాత పద్ధతుల్లో పనిచేసేవారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
