పుణె కోర్టు బయట దారుణం.. హత్య కేసు నిందితుడి చేయి నరికేసిన దుండగులు!

పుణె కోర్టు బయట దారుణం.. హత్య కేసు నిందితుడి చేయి నరికేసిన దుండగులు!

మహారాష్ట్రలోని పుణెలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కొందరు దుండగులు  పదునైన కత్తులు, ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో అతడి ఒక చేయి తెగిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. న్యాయం కోసం ప్రజలు వచ్చే కోర్టు బయటే ఇలాంటి దాడి జరగడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పుణెలోని శివాజీనగర్ జిల్లా కోర్టు  సమీపంలో జరిగింది. కోర్టు గేట్ నంబర్ 4 దగ్గర ఈ దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందార్ కివాలే అనే వ్యక్తి కోర్టు విచారణ కోసం అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ముందుగా మాటువేసిన కొందరు వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడికి దిగారు.

ఆరుగురు వ్యక్తులు.. కత్తులతో ఒక్కసారిగా దాడి!
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సుమారు ఐదు, ఆరుగురు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారు. మందార్ కివాలే కోర్టు దగ్గరకు రాగానే దుండగులు అతడిని వెంబడించారు. తరువాత   పదునైన కత్తులు, ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో కివాలేకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతడి ఒక చేయి తెగిపోయినట్లు సమాచారం. ఈ దాడి జరిగిన వెంటనే అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు. దాడి చేసిన వ్యక్తులు వారి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో రెండు ద్విచక్ర వాహనాలపై అక్కడి నుంచి పరారయ్యారు.

ఘటనా స్థలంలో పిస్టళ్లు, బుల్లెట్ల మ్యాగజైన్  
దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహించగా రెండు పిస్టళ్లు, బుల్లెట్స్  ఉన్న ఒక మ్యాగజైన్ లభించినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే దాడి సమయంలో దుండగులు కాల్పులు జరిపారా ? లేదా ? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలు, దాడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు తీవ్రంగా గాయపడిన మందార్ కివాలేను వెంటనే పుణెలోని ససూన్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అసలు ఈ మందార్ కివాలే ఎవరు?
మందార్ కివాలే ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2025 ఏప్రిల్ 20న భూమి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం కారణంగా శుభం సుభాష్ చవాన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో కివాలే నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య ఘటన తర్వాత ఇరువర్గాల మధ్య పాత కక్షలు కొనసాగుతున్నాయా ? ఆ గొడవలే తాజా దాడికి కారణమా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

జైలు నుంచి విడుదలైన నాలుగు రోజులకే దాడి
ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దాడికి కేవలం నాలుగు రోజుల ముందే మందార్ కివాలే జైలు నుంచి విడుదలైనట్లు చెబుతున్నారు. హత్య కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అతడు అక్కడికి వచ్చాడు. అయితే కోర్టు ప్రాంగణం బయటే చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే అతడిపై దుండగులు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.  

పుణెలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి? సుప్రియా సూలే ఆగ్రహం
ఈ ఘటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా స్పందించారు. పుణెలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు అంటే సామాన్య ప్రజలు వారి న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చే ప్రదేశమని.. అలాంటి న్యాయస్థానం సమీపంలోనే పట్టపగలు దాడులు జరిగితే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.

కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరికీ భద్రత ఉండాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. నగరంలో ఇటీవల హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని కూడా సూలే ప్రస్తావించారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలతో దాడులు, కాల్పులు, హత్యలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
కోర్టు బయట జరిగిన ఈ దాడితో పుణెలో కలకలం రేగింది. దాడికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులు ఎవరు? వారి వెనుక ఎవరున్నారు? పాత హత్య కేసులో ఉన్న కక్షలే ఈ దాడికి కారణమా? అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు పరారీలో ఉండటంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మందార్ కివాలే ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.