బయటకు ప్రశాంతంగా కనిపించే నాగ చైతన్య మనసులో ఎన్నో భావోద్వేగాలు దాగి ఉన్నాయని తాజా ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఏడవాలని అనిపించినా కన్నీళ్లు రావని నాగచైతన్య మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా ట్రోలింగ్, విమర్శలను ఎలా తీసుకుంటారో కూడా చైతూ మనసు విప్పి మాట్లాడారు. ‘వృషకర్మ’ ప్రమోషన్లలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని రామగిరి ఖిల్లాపై జాస్తి శ్రీనివాస్‌తో కలిసి ఎనిమిది గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తూ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆసక్తి రేపుతోంది. ఇందులో తన వ్యక్తిగత జీవితం, సినిమా విశేషాలను పంచుకున్నారు. మరి ఆ వివరాలేంటో చూసేద్దాం..
సాధారణ ఇంటర్వ్యూలకు భిన్నంగా ప్రకృతి ఒడిలో, చారిత్రక నేపథ్యం ఉన్న రామగిరి ఖిల్లాపై సుమారు ఎనిమిది గంటల పాటు నడుస్తూ సాగిన ఈ ముచ్చటలో నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. ఒకవైపు ఆయన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతుంటే.. మరోవైపు ‘వృషకర్మ’లో ఆయన పోషిస్తున్న పాత్ర, దాని కోసం చేసిన శారీరక కసరత్తుల గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
ఏడవాలని ఉంటుంది.. కానీ కన్నీళ్లు రావు: చైతూ ఎమోషనల్
ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కొన్ని సందర్భాల్లో విపరీతంగా ఏడవాలని అనిపించినా కన్నీళ్లు రావని, బాధను పైకి వ్యక్తపరచలేక లోలోపలే కుమిలిపోతుంటానని చైతూ వెల్లడించారు.
సోషల్ మీడియా ట్రోలింగ్, విమర్శలపై స్పందిస్తూ.. తన మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ఇంటర్నెట్లో ఒక వార్త ఎక్కువ రోజులు ఉండదని, నెగటివిటీని పట్టించుకోకుండా ముందుకు సాగడమే తన విధానమని స్పష్టం చేశారు. ఈ లేటెస్ట్ కామెంట్స్ చైతన్య వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
8 గంటల ట్రెక్కింగ్.. రామగిరి ఖిల్లాపై చైతూ స్పెషల్ ఇంటర్వ్యూ!
‘వృషకర్మ’ ప్రమోషన్ల కోసం నాగ చైతన్య వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న చారిత్రక రామగిరి ఖిల్లాపై కంటెంట్ క్రియేటర్ జాస్తి శ్రీనివాస్‌తో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ ప్రయాణం సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఈ ఎనిమిది గంటల ముచ్చటలో తన సినీ ప్రయాణం, కుటుంబ జ్ఞాపకాలు, వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు.
పురాతన కోటలు, రహస్య గుహలు, మిథికల్ అంశాలతో కూడిన ‘వృషకర్మ’ కథకు రామగిరి ఖిల్లా నేపథ్యం చక్కగా సరిపోవడంతో ఈ ప్రదేశాన్ని ప్రమోషన్ల కోసం ఎంచుకోవడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఇంటర్వ్యూ ప్రోమో ఆసక్తి పెంచుతుండగా, పూర్తి వీడియో నవంబర్ 27న విడుదల కానుంది.
‘వృషకర్మ’ కథేంటి?
‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఇందులో పురాతన గుహలు, రహస్య చిత్రాలు, నిధి వేట, అతీంద్రియ శక్తుల చుట్టూ కథ సాగనుంది. విడుదలైన గ్లింప్స్‌లో స్పార్ష్ శ్రీవాస్తవ గీసిన వింత చిత్రాలు, వాటిలో కనిపించే భయానక సంఘటనలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ క్రమంలో మేల్కొనే ప్రమాదకర శక్తులను ఎదుర్కొనే రక్షకుడిగా నాగ చైతన్య కనిపించనున్నారు. అయితే ఈ మిస్టరీ వెనుక అసలు రహస్యం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంచారు.
అర్జున్‌గా చైతూ.. పాత్ర కోసం భారీ కసరత్తులు!
‘వృషకర్మ’లో నాగ చైతన్య అర్జున్ అనే ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకుని ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఫిట్నెస్ ట్రైనర్ అరుణవ భట్టాచార్య పర్యవేక్షణలో స్ట్రెంత్ ట్రైనింగ్, స్విమ్మింగ్, యోగా వంటి వ్యాయామాలు చేశారు. యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా అథ్లెటిక్ బాడీని తీర్చిదిద్దుకున్నారు. అంతేకాదు, క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కఠినమైన డైట్‌ను కూడా పాటించారు. గతంలో చేసిన పాత్రలతో పోలిస్తే అర్జున్ పాత్ర తనకు సరికొత్త అనుభూతినిచ్చిందని చైతూ తెలిపారు.
50 రోజుల్లో భారీ గుహ సెట్.. 20 నిమిషాల కథ అక్కడే!
‘వృషకర్మ’లో బ్రహ్మగిరి గుహలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కథలో కీలకమైన ఈ గుహల కోసం చిత్రబృందం మూడు ఛాంబర్లతో భారీ సెట్‌ను నిర్మించింది. ఈ సెట్ రూపకల్పనకు ఏకంగా 50 రోజులు పట్టిందట. సినిమాలో సుమారు 20 నిమిషాల పాటు కథ ఈ గుహల నేపథ్యంలోనే సాగనుంది.
కంప్యూటర్ గ్రాఫిక్స్‌పై ఆధారపడకుండా సహజత్వం కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించినట్లు దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెలిపారు. దీనికోసం పలు లొకేషన్లు, డాక్యుమెంటరీలను పరిశీలించారట. ఇక దర్శకుడు ఈ సినిమా కథను నాగ చైతన్యకు దాదాపు ఏడు గంటల పాటు వివరించారట. సెట్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని చైతూ వెల్లడించారు. డిసెంబర్ 4న విడుదల కానున్న ‘వృషకర్మ’తో నాగ చైతన్య ఎలాంటి కొత్త అనుభూతిని అందిస్తారో చూడాలి!
